అమెరికాకు చెందిన లాయిల్ విల్‌కాక్స్ అనే మహిళ ప్రపంచ రికార్డు సృష్టించింది. సైకిల్‌పై అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టిన మహిళగా ఘనతను సొంతం చేసుకున్నది. 108 రోజులు, 12 గంటలు, 12 నిమిషాల్లో ఆమె ప్రపంచాన్ని చుట్టేసింది. సైక్లిస్ట్ విల్‌కాక్స్ ఆ సమయంలో 29,169 కిలోమీటర్లు(18,125 మైళ్లు) దూరాన్ని కవర్ చేసింది.
38 ఏళ్ల విల్‌కాక్స్ చికాగో నుంచి మొదలుపెట్టి తన జర్నీని మళ్లీ అక్కడే ముగించింది. మే 28వ తేదీన ఆమె తన జర్నీ ప్రారంభించింది. 4 ఖండాల్లోని 21 దేశాల్లో ఆమె టూర్ చేసింది. ప్రతి రోజు 14 గంటల పాటు ఆమె సైకిల్ తొక్కేది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆమె రికార్డును వెరిఫై చేయనున్నది. అమెరికాలో జరిగే 4 వేల మైళ్ల ట్రాన్స్ ఆమ్ అనే రేస్‌ను గెలిచిన తొలి మహిళగా విల్‌కాక్స్ రికార్డుకెక్కింది. కొండల మధ్య సాగే టూర్ డివైడ్ రేస్‌లోనూ రికార్డు సృష్టించింది.
సైక్లిస్టులు తమ జర్నీలో భాగంగా కనీసం 28,970 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. చికాగో నుంచి మొదలుపెట్టిన విల్‌కాక్స్ మొదట న్యూయార్క్ చేరుకున్నది. అక్కడ నుంచి పోర్చుగల్‌కు విమానంలో వెళ్లింది . ఆ తర్వాత కొన్ని వారాల పాటు ఆమ్‌స్టర్‌డ్యామ్, జర్మనీ, ఆల్ప్స్ పర్వతాల్లో తిరిగింది. టర్కీ నుంచి జార్జియా కు వెళ్లింది. అక్కడ నుంచి ఆస్ట్రేలియాకు విమానంలో వెళ్లింది. పెర్త్ నుంచి సైకిల్‌పై బ్రిస్‌బేన్‌కు వెళ్లింది. అక్కడ న్యూజిలాండ్‌కు ఫ్లయిట్ ఎక్కింది. పసిఫిక్ తీరం వెంట పెడలింగ్ చేసింది. లాస్ ఏంజిల్స్ వరకు ఆమె వెళ్లింది. ఆ తర్వాత 66 రూట్‌లో చికాగో చేరుకున్నది. గతంలో జెన్నీ గ్రహం అనే స్కాట్‌లాండ్ మహిళ 2018లో 124 రోజుల్లో ఆ రికార్డును నెలకొల్పింది.