తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో పయనిస్తుందని ఎన్‌ఆర్‌ఐ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత కొన్ని రోజు లుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందన్నారు. కావాలనే తనపై అక్రమ కేసులు, హత్యాయత్నాలకు పాల్పడి బెదిరించే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదని మండిపడ్డారు. కేసీఆర్ రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుందని ఆరోపించారు. రైతు రుణమాఫీ అంతా బోగస్. రైతు భరోసా కూడా బోగస్. రాబోయే రోజుల్లో రేవంత్ సర్కారుకి బీఆర్‌ఎస్ చుక్కలు చూపిస్తుందన్నారు. ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ రౌడీల దౌర్జన్యం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరిగిన దాడులు రేవంత్ రెడ్డి సర్కారు దురాగతాలకు నిదర్శనమన్నారు.