లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు అయిదున్నర నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆయనకు ఊరట లభించింది. సీబీఐ,ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందనే సంబరాల నడుమ, ఆప్ నేతలు, కార్యకర్తలు తిహార్ జైలుకు భారీగా చేరుకున్నారు. ఆయన బయటకు రాగానే పూలదండలతో స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుని, టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్, ఆమె కూతురు, అదేవిధంగా పంజాబ్ సీఎం మాన్ కూడా కేజ్రీవాల్‌కు స్వాగతం పలికేందుకు వచ్చారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ తనను విడుదల చేయాలని కోరుతున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. జైళ్లు తనను బలహీన పరచలేవని, జైలుకెళ్లడం వల్ల తన ధైర్యం 100 రెట్లు పెరిగిందన్నారు. దేవుడు చూపిన బాటలో పయనిస్తూ దేశానికి సేవ చేస్తాను. దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని సీఎం కేజ్రీవాల్ అన్నారు. అనంతరం తీహార్ నుంచి చేస్తూ తన ఇంటికి వెళ్లారు.