తగ్గిపోతున్న జనాభా, పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్యతో చైనా ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతున్నది. దీంతో యువతీ యువకులను త్వరగా పెండ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, ఆలస్యంగా రిటైర్ అవ్వండి అంటూ వేడుకుంటున్నది. యుక్త వయసులోనే యువతీ యువకులకు వివాహాలు చేయించేందుకు నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదే సమయంలో జనాభా సంబంధిత సమస్యల నివారణకు పదవీ విరమణ వయసును క్రమంగా పెంచుకుంటూ పోవాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
ఇటీవల కాలంలో తగ్గుతున్న జనన రేటు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళన పరుస్తున్నది. ప్రస్తుతం చైనాలోని నిబంధనలు ప్రకారం యువకులు 22 ఏండ్లు నిండిన తర్వాత, యువతులు 20 ఏండ్ల తర్వాత మాత్రమే వివాహం చేసుకోవాలి. అయితే పిల్లల పెంపకానికి అధిక ఖర్చు కావడం, కెరీర్‌కు సంబంధించిన లక్ష్యాలు, కొన్ని సంప్రదాయ కట్టుబాట్ల కారణంగా చాలామంది మహిళలు పిల్లలను కనడానికి సందేహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరగా పెళ్లి చేసుకుని, తొందరగా పిల్లల్ని కనాలంటూ చైనా నినదించనుంది. అందులో భాగంగానే రిటైర్మెంట్ వయసును కూడా పురుషులకు 60 నుంచి 63కు, మహిళలకు 50 నుంచి 55కు ఆయా ఉద్యోగాలను బట్టి పెంచాలని యోచిస్తున్నది. దీనిని 2025లో ప్రారంభించి 2040కు పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.