కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు వరుసగా రెండో ఉప ఎన్నికలోనూ ఎదురుదెబ్బ తగిలింది. అధికార లిబరల్ పార్టీ మాంట్రియల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఒక సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈ ఫలితాలతో జస్టిన్ ప్రధాన పదవికి రాజీనామా చేయాలని ఒత్తిడి రావచ్చునని భావిస్తున్నారు. లాసల్-ఎమర్డ్-వెర్డున్ ఉప ఎన్నికలలో లిబరల్ అభ్యర్థి లారా పాలెస్తినీ ఓటమి చెందారు. ఆయనపై క్యుబియోకిస్ అభ్యర్థి లూయిస్ ఫిలిప్పే విజయం సాధించారు. తొమ్మిదేండ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రాభవం ఇటీవలి కాలంలో మసకబారుతూ వస్తున్నది.
2025 అక్టోబర్‌లో జరిగే ఎన్నికల్లో తానే నేతృత్వం వహిస్తానని ట్రూడో పట్టుబడుతూ వస్తున్నారు. అయితే ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. తన పరిధిలోని పలు నియోజకర్గ నేతలు ట్రూడోను సాగనంపాలని కోరుకుంటున్నట్టు గత వారం లిబరల్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ మెండిస్ అనే చట్టసభసభ్యుడు తెలిపారు. దేశంలో పెరిగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆమె చెప్పారు.