తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) ఉపాధ్యక్షులు గోనె నరేందర్ రెడ్డి (54) 11 సెప్టెంబర్ 2024 న తమ సొంత నివాసం లో తీవ్ర గుండెపోటు కు గురై స్థానిక ఎంగ్ టెంగ్ ఫాంగ్ జనరల్ హాస్పిటల్ లో మృతి చెందారు . ఆయన ఆకస్మిక మృతి విషయం తెలుసుకున్న సింగపూర్ లో ఉన్న ఇరు తెలుగు రాష్ట్రాల వారితో పాటు స్థానిక మిత్రులందరూ దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
సొసైటీ సభ్యులు ఈ బాధా సమయం లో నరేందర్ గారు సమాజానికి చేసిన సేవలను క్రింది విధంగా నెమరువేసుకున్నారు.
ఓ నరేందర్ అన్న, సరిహద్దులు దాటి సింగపూరుకొచ్చి, తెలుగోల్లకు తోబుట్టువై, సాగరతీరంలో స్వాతి చినుకు వై, సంస్కృతి సంప్రదాయానికి నిలువుటద్దమై, తంగేడుపువ్వుల జాడ చెప్పి, బతుకమ్మకు వన్నె తెచ్చి, పోత రాజు ల పౌరుషం పులి రాజుల గాంభీర్యం మాకు పరిచయం చేసి, బోనం అంటే నరేంద్రుడు బతుకమ్మ కు పెద్దకొడుకు, నీ కోపం ఒక కారణం ,నీ ప్రేమ చల్లని సముద్రం… నీ జాలి ఒక వర్షం, నీ చూపు మాకు ప్రమాణం… గణనాధుని గుడిని ఇటుకలతో పేర్చి, కార్మికులతో కలిసి అన్నలాగా అండగా ఉండి, అక్షింతలు తెచ్చి అయోధ్యనే మాకిచ్చి, రామయ్యను చూపించిన రామబంటువా, నీ భుజ స్కంధాలు మా బతుకమ్మకు నిలయం, ఈ సింగపూరు బోనం నువ్వు మాకిచ్చిన వరం. నువ్వెక్కడున్న నీమీసం మన TCSS కు రోషం, బతుకమ్మకు నువ్వు చేసే ప్రదిక్షణం మాగర్వం, నీ మీసం మెలిపెడితే తీను మారు స్టెప్పులు. ప్రేమతో పలకరించే చెరగని నీ చిరునవ్వు ఎలా మరిచేది, నీ జ్ఞాపకాలు ఎప్పటికీ మామది నిండా.. నీవు లేవనే మాట అబద్ధం అయితే బావుండు.. మా TCSS బాహుబలికి ఇవే మా జోహార్లు!!!!!
ఎప్పటికీ నీ యాది లో..
వెల్గటూర్ గ్రామం, కొత్తపేట్ మండలం, జగిత్యాల జిల్లా కు చెందిన గోనె నరేందర్ గారు గత 25 సంవత్సరాల నుంచి సింగపూర్ లో ఉంటున్నారు. ప్రస్తతం తన కుటుంబం తో సహా శాశ్వత నివాస హోదాలో సింగపూర్ లో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఒక కూతురు మరియు కుమారుడు. ఆయన పార్థివదేహాన్ని 12 సెప్టెంబ ర్ 2024 న మిత్రుల సందర్శనార్థం ఉంచడం జరిగింది. వందల సంఖ్యలో మిత్రులు సందర్శనకు వచ్చి ఆశ్రు నివాళి అర్పించారు. ఆయన సింగపూర్ లో ఉన్న తెలుగు వాసులకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన మృదు స్వభావి, మరియు ఎప్పుడు ప్రతి ఒక్కరిని చిరు నవ్వుతో పలకరించే వారని, ఎవరికి ఏ సహాయం అవసరం ఉన్న ముందుకు వచ్చి సహాయం చేసేవారని గుర్తు చేసుకొన్నారు. ఈ దుఃఖ సమయం లో తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ సభ్యులు ఆయన కుటుంబం వెన్నంటే ఉండి అన్ని విషయాలలో సహాయ సహకారాలు అందించి, ఆయన పార్థీవ దేహాన్ని ఇండియా కు తరలించారు మరియు వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేయడం జరిగింది. మరియు ఆయన ఇక తిరిగిరారు అనే విషయాన్నీ ఇప్పటికి జీర్ణించుకోలేక పోతున్నామని తీవ్ర ఆవేదన కు గురయ్యారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ గోనె నరేందర్ కుటుంబానికి ఎల్లపుడు తోడుగా ఉంటూ వారికీ సాధ్యమైన సహాయం చేస్తామని చెప్పి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు తోడుగా గోనె నరేందర్ సమీప బంధువు ఓరిగంటి శేఖర్ రెడ్డి గారు వారి వెంట ఇండియా కు వెళ్ళడం జరిగింది.
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)