రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేైట్టెయాన్. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆడియో రిలీజ్ వేడుక చెన్నైలో జరిగింది.ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ ఒక హిట్ సినిమా తర్వాత ఎలాగైనా మరో హిట్ కొట్టాలనే టెన్షన్ ఉంటుంది. హిట్ కావాలంటే ఓ మ్యాజిక్ జరగాలి. అన్నీ కుదరాలి. జైలర్ తర్వాత నేను అంతగా కథలు వినడం లేదు. కానీ దర్శకుడు జ్ఞానవేల్ చెప్పిన ఈ కథ నచ్చడంతో వెంటనే అంగీకరించా అన్నారు.
ఈ సినిమాలో అమితాబ్ వంటి పెద్దస్టార్ భాగం కావడంతో నాలో ఉత్సాహం రెట్టింపయ్యింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా అమితాబ్‌ను నేను స్ఫూర్తిగా తీసుకుంటా. ఓ సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఆయన కెరటంలా పైకి లేచారు. 80 ఏండ్ల వయసులో కూడా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, రానా ఈ సినిమాలో గొప్ప పాత్రలు చేశారు అన్నారు.
రజనీకాంత్‌తో కలిసి నటించడం గర్వంగా భావిస్తున్నానని అమితాబ్ బచ్చన్ చెప్పారు. రజనీకాంత్, అమితాబ్‌బచ్చన్ నుంచి ఎన్నో జీవిత సత్యాలను తెలుసుకున్నానని, అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని దర్శకుడు జ్ఞానవేల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.