Namaste NRI

అమెరికా వ్యాప్తంగా తానా కళాశాల పరీక్షలు విజయవంతం

అమెరికా దేశవ్యాప్తంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి కళాశాల పరీక్షలు శనివారం విజయవంతంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న తానా వారి ఈ కళాశాల కోర్సుల వార్షిక పరీక్షలకు వందలాదిమంది విద్యార్థులు టెక్సాస్,   జార్జియా, నార్త్ కరోలినా, న్యూ జెర్సీ,  మిచిగాన్, మసాచుసెట్స్, ఒమహా, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల నుండి హాజరయ్యారు. కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీతం లలో కళాశాల వారు నిర్వహిస్తున్న ఈ కోర్సులకు అమెరికా వ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది.

భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటానికి తానా వారు చేస్తున్న ఈ కృషికి విద్యార్థినులు వారి తల్లిదండ్రులు మిక్కిలి ఆనందం వెళ్ళబుచ్చారు. వివిధ రాష్ట్రాలలో ఈ పరీక్షలు విజయవంతంగా జరగడం పట్ల తానా కళాశాల చైర్ శ్రీమతి మాలతి నాగ భైరవ మరియు తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు మిక్కిలి సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో విశిష్టత కలిగిన మన  సంప్రదాయ కళలను అమెరికాలో నేర్చుకుంటూ మన వారసత్వ సంపదను కాపాడుతున్న విద్యార్ధినులని అభినందిస్తూ, అందుకు తోడ్పాటుని అందిస్తున్న వారి తల్లిదండ్రులకు వీరివురు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ ప్రోగ్రామ్ విజయవంతమయ్యేలా కృషి చేస్తూ విద్యార్ధినులకు శాస్త్రీయ నృత్యం మరియు కర్ణాటక సంగీతంలో అత్యుత్తమ శిక్షణని అందిస్తున్న గురువులందరికీ ధన్యవాదములు తెలియజేశారు.

శ్రీమతి మాలతి గారు మాట్లాడుతూ ఈ సంవత్సరం కొత్తగా పరీక్షా విధానం లో తీసుకువచ్చిన వచ్చిన మార్పులకు విద్యార్థినులు మరియు తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేశారని మరియు ఈ మార్పునకు కారణమైన కొత్త కార్యవర్గానికి  అభినందనలు తెలియజేశారు. వచ్చే వార్షిక సంవత్సరము నుండి వీణ, మృదంగం తదితర కోర్సులను కూడా చేర్చి ఈ కార్యక్రమం విస్తృతిని పెంచుతూ మరింతమంది గురువులను తానా కళాశాలకు సంఘటితం చేస్తూ మరెందరో విద్యార్థినులకు చేరువ  చేయాలని సంకల్పిస్తున్నామని తెలియజేశారు.

తానా కళాశాల ముఖ్య సలహాదారులైన శ్రీ రాజేష్ అడుసుమిల్లి  ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న కళాశాల కార్యవర్గం అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కళాశాల కోఆర్డినేటర్స్ వెంకట్ ఆవిర్నేని, రవీంద్ర చిట్టూరి, రమా ప్రత్తిపాటి మరియు తానా ప్రతినిధులు కృష్ణ ప్రసాద్ సోంపల్లి, వెంకీ అడబాల, రామకృష్ణ వాసిరెడ్డి, నాగ పంచుమర్తి, పరమేష్ దేవినేని, శ్రావణి సుధీర్ తదితరులు ఆయా నగరాల నుండి ఎంతో  సహకారం అందించారు. విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులు ఈ కళాశాల ప్రోగ్రాం కి చూపిస్తున్న ఆదరణకు ముగ్దులైన తానా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుండి మరింత ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress