రామ్‌చరణ్ గేమ్ చేంజర్ నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. కళ్లజోడు తీస్తే నాలాంటివాడ్నే.. షర్ట్ పైకి పెడితే నీలాంటివాడ్నే అంటూ సాగే ఈ పాటను అనంతశ్రీరామ్ రాయగా, తమన్ స్వరపరిచారు. నకాష్ అజీజ్ ఆలపించారు. ఈ పాటను హిందీ, తమిళ వెర్షన్లను కూడా విడుదల చేశారు. దర్శకుడు శంకర్ తనదైన మార్క్ చూపిస్తూ గ్రాండియర్‌గా ఈ పాటను తెరకెక్కించారని, రామ్‌చరణ్ ఎనర్జిటిక్‌గా, ైస్టెలిష్ లుక్‌తో ఈ పాటలో అలరించారని నిర్మాత దిల్‌రాజు తెలిపారు. వెయ్యిమంది జానపద కళాకారులతో కలిసి రామ్‌చరణ్ చేసిన డాన్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తుంది. వివిధ రాష్ర్టాలకు చెందిన జానపద కళాకారులు ఈ పాటలో భాగం అవ్వడం విశేషం.
తెలుగు రాష్ర్టాలకు చెందిన గుసాడి, కొమ్ము కోయ, తప్పెటగుళ్లు వంటి జానపద రీతులతోపాటు వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిన గుమ్రా, రానప్ప, పైకా, దురువ, కర్ణాటకకు చెందిన హలారి, ఒక్కలిగ, గొరవర, కుణిత వంటి నృత్య రీతుల్ని ఈ పాటలో శంకర్ భాగం చేశారు. తమన్ సంగీతం, గణేశ్ ఆచార్య కొరియోగ్రఫీ, రామ్‌చరణ్ స్టెప్పులు థియేటర్లలో జాతరను తలపిస్తాయ్ అని మేకర్స్ తెలిపారు. కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.