శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నరుడి బ్రతుకు నటన. రిషికేశ్వర్ యోగి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, సింధు రెడ్డి నిర్మాతలు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శివకుమార్ రామచంద్రపు మాట్లాడుతూ ఈ సినిమాలో నా పాత్ర పేరు సత్య. అతనిది సంపన్న కుటుంబం. నటుడు కావాలనే కోరిక ఉంటుంది. అలాంటి వ్యక్తి అనుకోకుండా కేరళలోని తెలియని ప్రాంతానికి వెళ్లి అక్కడ ఎలా జీవితాన్ని సాగించాడు? అతనికి తోడుగా ఎవరు నిలిచారు? అన్నదే సినిమా కథ. హీరోగా ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నా అన్నారు. నితిన్ ప్రసన్న మాట్లాడుతూ దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు హార్ట్ టచింగ్‌గా అనిపించింది. మనుషులందరూ పరస్పర ప్రేమ, అభిమానంతో ఉంటే సమాజం ఎంత బాగుంటుందో అనే ఫిలాసఫీతో తీశారు. స్నేహం గొప్పతనాన్ని, మానవ భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించే కథ ఇది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన వివిధ ఫిలిం ఫెస్టివల్స్‌లో ఈ చిత్రానికి 60కిపైగా అవార్డ్స్ వచ్చాయి. థియేటర్ నుంచి ప్రేక్షకులందరూ ఓ ఎమోషనల్ ఫీల్‌తో బయటకొస్తారు అని చెప్పారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది.
