పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌కు అక్కడి తెలుగు ప్రముఖులు, టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మంత్రి లోకేశ్‌కి స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే ప్రపంచ ఐటీ రంగంలో తెలుగువారు ఓ వెలుగు వెలుగుతున్నారని ఈసందర్భంగా టీడీపీ ఎన్నారై విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశ ఐటీ రంగంలో హైదరాబాద్ -హైటెక్ సిటీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు. 2000 సంవత్సరంలో విజన్ 2020 అంటూ ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని అంచనా వేసిన విజనరీ లీడర్ చంద్రాబాబని పేర్కొంది. ఈ నేపథ్యంలో తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్న ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ 2047 నాటికి వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ సాధనకు అహర్నిశలు శ్రమిస్తున్నారని టీడీపీ ఎన్నారై విభాగం పేర్కొంది.
తన తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు ఐటీ రంగంపై చంద్రబాబుకు ఉన్న ప్రత్యేక శ్రద్ధను లోకేష్ పుణికి పుచ్చుకున్నారని, ఈ క్రమంలోనే ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నారా లోకేష్ ఈనెల25వ తేదీ నుంచి అమెరికాలో పర్యటిస్తున్నారని టీడీపీ ఎన్నారై విభాగం తెలిపింది. ఈ క్రమంలోనే శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో లోకేష్ కు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ ఎన్నారై నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. నభూతో నభవిష్యత్తు అనే రీతిలో టీడీపీ విజయం సాధించడంతో ఎన్నారై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. మంగళగిరి ఎన్నికల్లో ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టి తిరుగులేని విజయం సాధించి మంత్రి బాధ్యతలు స్వీకరించిన లోకేష్‌కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పేందుకు భారీ సంఖ్యలో టీడీపీ ఎన్నారై నేతలు పెద్దఎత్తున విమానాశ్రయానికి వచ్చారు.
ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కో ఆర్డినేటర్ జయరాం కోమటి, ఎన్నారై టీడీపీ మీడియా కో ఆర్డినేటర్ సాగర్ దొడ్డపనేని, స్థానిక టీడీపీ నేతలు శశి దొప్పలపూడి, శ్రీకాంత్ దొడ్డపనేని, టీడీపీ జోనల్ ఇంచార్జి రవి మందలపు, ఐటీ సర్వ్ ప్రతినిధులు వినోద్ ఉప్పు, సతీశ్ మండవ, సురేశ్ మానుకొండ ఎయిర్ పోర్టులో మంత్రి లోకేశ్‌కు ఘన స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.