అగ్రరాజ్యం అమెరికాలో మొత్తం 50 రాష్ర్టాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికల్లో కొన్ని రాష్ర్టాలు ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. వాటినే స్వింగ్ స్టేట్స్ అంటారు. తటస్థ ఓటర్లతో అమెరికా అధ్యక్ష ఎన్నికలను మలుపు తిప్పగలిగే ఈ స్వింగ్ స్టేట్స్ జాబితాలో అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ ఉన్నాయి. దీంతో ఈసారి స్వింగ్ స్టేట్స్‌ను గెలుచుకునేందుకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
గత ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఈ 7 రాష్ర్టాల్లో ఆరింట పైచేయి సాధించి 306-232 ఓట్ల తేడాతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోగా, ఒక్క నార్త్ కరోలినాలో మాత్రమే ట్రంప్ ఆధిక్యంలో నిలిచారు. ఈ నేపథ్యంలో ఈసారి స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్, హారిస్ మధ్య పోరు హోరాహోరీగా సాగవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి అమెరికాలో చాలా మంది ఓటర్లు ఏ పార్టీకి మద్దతు తెలుపబోతున్నదీ ముందే చెప్పేస్తారు.
తద్వారా రిపబ్లికన్లు, డెమోక్రాట్లుగా గుర్తింపు పొందుతారు. దీంతో ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారో ముందే తెలిసిపోతుంది. కానీ, స్వింగ్ రాష్ర్టాల ప్రజలు మాత్రం పార్టీల సిద్ధాంతాలకు కట్టుబడకుండా తటస్థంగా ఉంటారు. గుడ్డిగా ఏ పార్టీకీ మద్దతివ్వరు. దీంతో ఈ స్వింగ్ రాష్ర్టాలే అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారి ఫలితాలను మార్చేస్తుంటాయి.