అమెరికాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో భేటీ అయ్యారు. డిజిటల్ గవర్నెన్స్ కు సాంకేతిక సహకారం అందించాలని ఈ భేటీలో లోకేష్ కోరారు. అమరావతిని ఏఐ క్యాపిటల్ గా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సందర్శించాల్సిందిగా ఈ సందర్భంగా సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు. నారా లోకేశ్ మాట్లాడుతూ విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా రూపుదిద్దుకుందని, ప్రస్తుతం 4వ సారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన బాబు ఏపీని టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందు కు ప్రణాళికలు రూపొందిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్ పార్కులను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ హబ్‌లను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంలో మైక్రోసాఫ్ట్ సహకారం అవసరం అని పేర్కొన్నారు.
క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్‌ల ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ ప్రపంచస్థాయి సంస్థలకు ప్రాంతీయ కేంద్రం గా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. అటువంటి పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు, భూమి తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్లౌడ్ సేవల్లో మైక్రోసాఫ్ట్ నాయకత్వంతో కలిసి మేము అత్యాధునిక సాంకేతిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని భావిస్తున్నామని అందుకు సహకరించాల్సిందిగా సత్య నాదెళ్లకు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.