హెచ్-1బీ, ఎల్-1 వీసాదారులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వీసాదారుల జీవిత భాగస్వాముల కోసం ఆటోమేటిక్ వర్క్ పర్మిట్ పునరుద్ధరణ గడువును 180 రోజుల నుంచి 540 రోజులకు పొడిగిస్తున్నట్టు యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్) ప్రకటించింది.
అయితే ఇది 2022 మే 4వ తేదీన, ఆ తర్వాత దరఖాస్తు చేసే వారికి వచ్చే ఏడాది జనవరి 13 నుంచి అమలు లోకి వస్తుందని వివరించింది. వర్క్ పర్మిట్ పునరుద్ధరణ ప్రక్రియలో ఆలస్యం అవుతుందని గతంలో నివేదికలు వచ్చిన కారణంగా వీసాదారుల పనికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ గడువును పెంచిన ట్టు వివరించింది. 2021 జనవరి నుంచి అమెరికా ఆర్థిక వ్యవస్థ 1.6 కోట్ల ఉద్యోగాలను కల్పించిందని, ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో పూర్తి అంకిత భావంతో పనిచేస్తున్నట్టు డీహెచ్‌ఎస్ కార్యదర్శి అలెజాండ్రో చెప్పారు.