అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీ మేరకు లక్షలాది మంది అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికా నుంచి పంపించాల్సి న 15 లక్షల మంది జాబితాను యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(ఐసీఈ) సిద్ధం చేసింది. నవంబర్‌లో విడుదల చేసిన ఈ జాబితాలో 17,940 మంది భారతీయులు ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను వెనక్కు పంపడానికి అమెరికా చరిత్రలోనే అతి పెద్ద కార్యక్రమాన్ని చేపడతానని ట్రంప్ హామీ ఇచ్చారు.
జనవరి 20న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపించే చర్యలను అమెరికా ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉంది. కాగా, ప్యూ రిసెర్చ్ సెంటర్ అనే సంస్థ డాటా ప్రకారం అమెరికాలో 7.25 లక్షల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నారు. అమెరికాలోని అక్రమ వలసదారుల్లో మెక్సికో, ఎల్ సాల్వడర్ దేశాలకు చెందిన వారి తర్వాత భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 90 వేల మంది భారతీయులు అక్రమంగా అమెరికా సరిహద్దు దాటే ప్రయత్నంలో భద్రతా సిబ్బందికి చిక్కారు.