తానా మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని మిల్‌పిటాస్‌లోని స్వాగత్ హోటల్ లో జయరామ్ బర్త్‌డే వేడులకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు ఆయనకు కేక్ తినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మైలవరం మండలం, వెల్వడం గ్రామంలో 1956, సెప్టెంబరు 26న జయరామ్ జన్మించారు. ఉన్నత విద్య అంతా అమెరికాలోనే సాగింది. అక్కడే ఆయన వ్యాపార వేత్తగా ఎదిగారు. అగ్రరాజ్యంలో తెలుగు వారి సమస్యలను పరిష్కరించే క్రతువును భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలోనే జయరాం తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అధ్యక్షులుగా ఉన్న సమయంలో విశేష సేవలు అందించారు. జయరాం కోమటి తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ప్రారంభించిన తెలుగుదేశం (టీడీపీ) పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగారు. టీడీపీ ఎన్నారై విభాగానికి నాయకుడిగా పనిచేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఉత్తర అమెరికాలో బాధ్యతలు వహించారు. జయరాం కోమటికి 1994లో ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఉత్తమ వ్యాపార వేత్తగా అవార్డును అందుకున్నారు. జయరాం తానా అభివృద్ధికి, తెలుగు వారికి మేలు చేసే కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
తాను పుట్టిన తెలుగు నేలకు జయరాం విశేష కృషి చేశారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు సేకరించారు. డిజిటల్ విద్యను ప్రోత్సహించారు. ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు. వీధి బాలలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, వారిని సమున్నతంగా తీర్చిదిద్దారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్‌కు 2004`05 వరకు అధ్యక్షులుగా, 2003`4 వరకు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రజా సేవలో పునీతమవుతున్న జయరాం కోమటి మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన సేవలు మరింత అందించాలని బావార్చి ఇండియన్ రెస్టారెంట్ అధినేత శ్రీకాంత్ దొడ్డపనేని ఆధ్వర్యంలో ఆయన అభిమానులు, తెలుగు వారు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో భక్తబల్లా, రజనీకాంత్ కాకర్ల, వెంకట్ కోగంటి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.