వైద్యరంగంలో కృత్రిమ మేధ అనూహ్య మార్పులను తీసుకొస్తున్నది. ఇప్పటికే వైద్య చికిత్సలు, సర్జరీలకు ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థల వినియోగం పెరుగుతుండగా ఇప్పుడు ఫేస్ ఏజ్ టూల్స్ వినియోగం మొదలయ్యింది. ఏఐ ద్వారా పని చేసే ఈ ఫేస్ ఏజ్ టూల్స్, ఒక్క సెల్ఫీతో మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. పుట్టిన తేదీ ప్రకారం వయసు ఎంత అనేది సంబంధం లేకుండా ఆరోగ్యపరంగా ఎంత వయసు అనేది తేలుస్తుంది. అమెరికా సహా పలు విదేశాల్లో ఈ ఫేస్ ఏజ్ టూల్స్‌ను డాక్టర్లు వినియోగిస్తున్నారు.
సాధారణంగా ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తి దవాఖానకు వెళ్లినప్పుడు వైద్యులు ముందుగా వయసు అడుగుతారు. వయసును బట్టి చికిత్స అందిస్తారు. అయితే, ఆరోగ్యకరమైన వ్యక్తుల్లో అసలైన వయసు కంటే బయాలాజికల్ వయసు తక్కువగా ఉంటుందని, అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో ఎక్కువ ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. పేషెంట్లకు సరైన చికిత్స అందించేందుకు గానూ వారి బయాలాజికల్ ఏజ్ తెలుసుకునేందుకు ఫేస్ ఏజ్ టూల్స్ ఉపయోగపడుతున్నాయని అంటున్నారు. క్యాన్సర్ పేషెంట్లు ఏన్నాళ్లు జీవిస్తారనేది అంచనా వేయడానికి కూడా వైద్యులకు ఈ టూల్స్ ఉపయోగపడుతున్నాయి.