ఖతార్‌లో జరిగిన ప్రతిష్టాత్మక “సౌత్ ఇండియన్ గ్లోబల్ టాలెంట్ అచీవర్స్ (SIGTA) అవార్డ్స్ 2024” వేడుకలో ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితులైన తెలుగు ప్రవాసి శ్రీ వెంకప్ప భాగవతుల “సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)” అవార్డును గెలిచారు. ఖతార్‌లోని తెలుగు సమాజానికి మరియు భారత సమాజానికి ఆయన అందించిన అసాధారణ కృషి, ప్రేరణాత్మక నాయకత్వం, వివిధ రంగాల్లో కనబరచిన విశిష్ట ప్రతిభా పాటవాలు, మరియు సేవలకు గౌరవంగా ఈ అవార్డు ఆయనను వరించింది.
“సౌత్ ఐకాన్ అవార్డు” అనేది SIGTA కార్యక్రమంలో అందించబడే అత్యున్నత గౌరవం. విదేశాల్లో నివసిస్తూ తమ మాతృభూమి యొక్క సాంస్కృతిక వారసత్వం మరియు నైతిక విలువలను పరిరక్షించడంలో, వాటిని ప్రోత్సహించ డంలో విప్లవాత్మకమైన కృషి చేసిన ప్రవాసులకు ఈ అవార్డు ప్రకటించబడుతుంది. ఖతార్‌లోని ప్రపంచ ప్రఖ్యాత AL MAYASA థియేటర్ (QNCC) లో జరిగిన ఈ ఘనమైన వేడుకకు 2,500 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు చిత్ర పరిశ్రమల ప్రముఖులు, వ్యాపార, వినోద, సాంస్కృతిక, సేవా, సామాజిక రంగాల నుండి ప్రతిష్టాత్మక వ్యక్తులు పాల్గొని తమ అభినందనలు తెలిపి, ఈ కృషికి ఎంతో గౌరవం అర్పించారు.
శ్రీ వెంకప్ప భాగవతుల గారు ఖతార్ మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు భాష, కళలు, సాంస్కృతిక వారసత్వం మరియు సామాజిక సేవలలో చేసిన అసాధారణ కృషికి గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యి, అందరి ప్రశంసలు మరియు అభినందనలు పొందారు.
శ్రీ వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ, “సౌత్ ఐకాన్ (ఆంధ్రప్రదేశ్)” అవార్డు పొందడం గర్వకారణంగా మరియు గౌరవం గా భావిస్తున్నాను. ఈ గౌరవం నా బాధ్యతను మరింత పెంచింది” అని పేర్కొన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు సంబంధించి, SIGTA కార్యవర్గం మరియు జ్యూరీ సభ్యులకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “ఈ గుర్తింపు నా ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. ఈ అవార్డును నా కుటుంబసభ్యుల కు, ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులకు, నాకు ప్రేరణగా నిలిచే నా మిత్రులకు, అలాగే ఖతార్‌లోని తెలుగు సమాజానికి అంకితం చేస్తున్నాను.” అని ఆయన అన్నారు.