16 ఏళ్లపాటు జర్మనీ ప్రభుత్వానికి సారధ్యం వహించిన ఏంజెలా మెర్కల్ పార్టీ తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఎన్నికల్లో సోషల్ డెమోక్రాటిక్ పార్టీకి అత్యధికంగా 25.7 శాతం ఓట్లు పోలవ్వగా, ఛాన్సలర్ మెర్కల్‌కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ కన్సర్వేటివ్ పార్టీకి 24.1 శాతం ఓట్లు పోలయ్యాయి. అయితే రెండు పార్టీల మద్య కేవలం 1.6 శాతం ఓట్లు తేడా మాత్రమే ఉంది. సోషల్ డెమోక్రటిక్ పార్టీ నేత ఓలాఫ్ స్కల్జ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్సర్వేటివ్ నేత ఆర్మిన్ లాపిట్ కూడా వివక్ష పార్టీలను ఏకంగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా ఏర్పడనున్న కూటమి ప్రభుత్వంలో గ్రీన్స్, లిబరల్ పార్టీలు కూడా కీలక పాత్ర వహించాలని యోచిస్తున్నాయి. ఈ ఎన్నికలు ఐరోపాలో కొత్త అధ్యాయానికి దారితీశాయి. మెర్కల్ ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే కొత్త ఛాన్సలర్ ఎన్నిక ఇంకా అస్పష్టంగానే ఉన్నది. పార్టీల మధ్య బేరసారాలు జరగవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.