నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సౌయిసౌజన్య నిర్మించిన చిత్రం డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ నేను అప్పట్లో చేసిన ఆదిత్య 369 చిత్రంలో కృష్ణదేవరాయల పాత్ర చిరస్థాయిగా నిలిచిపోయింది. అలాంటి పాత్ర చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి డాకు మహారాజ్ కథ పుట్టింది. బాబీ అద్భుతమైన కథ తయారు చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన అందరూ మనసుపెట్టి పనిచేశారు. అందరూ కెరీర్ కాస్త నెమ్మదించాక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతారు. నేను సక్సెస్‌లో ఉండే మొదలుపెట్టాను. ఇకనుంచి కొత్త బాలకృష్ణను చూస్తారు. సంక్రాంతికి నేను చేసిన సినిమాలన్నీ దాదాపుగా విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్‌ను ఈ సినిమాకూడా కొనసాగిస్తుందన్న నమ్మకంతో ఉన్నా అని నందమూరి బాలకృష్ణ అన్నారు.
బాలకృష్ణగారితో పనిచేస్తే ఆయన మాయలో పడిపోతాం. ఆయన ఫాలోవర్ అయిపోతాం. ఇంకొన్ని గంటల్లో సినిమా విడుదలవ్వబోతున్నది. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నా. విజయ్ కార్తీక్ కెమెరా సినిమాకు హైలైట్. నా కెరీర్‌లో బెస్ట్ విజువల్స్ ఇచ్చారు అని డైరెక్టర్ బాబీ చెప్పారు. ఏ సినిమాలోనైనా కొన్ని సీన్స్ హైలైట్‌గా ఉంటాయని, ఈ సినిమా అంతా హైలైట్‌గానే ఉంటుందని నందమూరి తేజస్విని పేర్కొన్నారు. బాబీ తయారు చేసిన డాకు మహారాజ్ వరల్డ్ చాలా గొప్పది. అఖండ తర్వాత బాలకృష్ణ అంత కష్టపడి చేసిన సినిమా ఇది. బాలకృష్ణగారు, నేను కలిసి పనిచేసిన సినిమా కాబట్టి, సౌండ్ బాక్స్‌లు బద్దలవ్వడం కామన్. మీరే జాగ్రత్త పడాలి. మాకైతే సంబంధం లేదు అని తమన్ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ, కథానాయికలు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్, ఊర్వశి రౌతేలా, డీవోపీ విజయ్ కార్తీక్ కన్నన్ తదితర యూనిట్ సభ్యులతోపాటు బాలకృష్ణ అల్లుడు, వైజాగ్ ఎంపీ భరత్ కూడా పాల్గొన్నారు.