తెలంగాణ జాగృతి లండన్ విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లండన్‌లో జరిగే మెగా బతుకమ్మ వేడుకల పోస్టన్‌ను టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని కవిత పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి లండన్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10న లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో యూకే తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు చేనేత చీరలను అందిస్తామని తెలంగాణ జాగృతి లండన్ విభాగం అధ్యక్షుడు సుమన్ బల్మూరి పేర్కొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, స్టేట్ జనరల్ సెక్రెటరీ నవీన్ ఆచారి, స్టేట్ సెక్రెటరీ రోహిత్ రావు, తెలంగాణ జాగృతి నాయకులు ప్రశాంత్ పూస, నితిష్, రోహిత్ రావ్, దినేష్ రెడ్డి, అనుషా దుర్గా, జితూ, రోహిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.