Namaste NRI

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 210 వ సాహిత్య సదస్సు ”

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 210 వ సాహిత్య సదస్సు ”సాహిత్య అద్భుత వర్ణనలు -వర్ణించ తరమా” అంశంపై జనవరి 19న  డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించబడింది. 
తొలుత శ్రీ త్యాగరాజ కృతి ”బంటు రీతి కొలువు ఇయ్యవయ్యా రామ” ప్రార్ధన గేయాన్ని లెనిన్ వేముల రాగయుక్తంగా ఆలపించడంతో సదస్సు ఆరంభమయ్యింది.
తరువాత మాట్లాడిన సమన్వయకర్త దయాకర్ మాడా టాంటెక్స్ 200 వ సదస్సు ను శ్లాఘిస్తూ ప్రముఖ సినీ కవి కీ శే వడ్డేపల్లి కృష్ణ గీతాన్ని వ్రాసి పంపినారనీ ఆ గీతం రికార్డు చేయ బడిందనీ చెప్పి ఆ గీతాన్ని అందరికీ వినిపించడం జరిగింది.

స్వాగతోపన్యాసం చేసిన పాలక మండలి ఉపాధిపతి మరియు సాహిత్య వేదిక సమన్వయకర్త దయాకర్ మాడా గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ సాహిత్య వేదిక క్రమం తప్పకుండా ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నదని, ఎంతో మంది ప్రసిద్దులు ఈ వేదికను అలంకరిచారని చెబుతూ ఈ మాసపు ముఖ్య అతిథి ని సాహితీ ప్రియులకు పరిచయం చేయడం జరిగింది. తెలుగు ఉపన్యాసకుడిగా ఎంతోమంది విద్యార్థులకు మొక్కవోని సేవలందించిన డాక్టర్ కొచ్చర్ల కోట చలపతి రావు ప్రాచీన పద్య సాహిత్యం, ఆయా కవుల అద్భుత వర్ణన విధానం గురించి అనర్గళంగా ఉపన్యసించారు. సంస్కృతాంధ్రములలో పూర్తి పట్టుసాధించిన చలపతిరావు గారు తెలుగు సాహిత్యంలో వృద్ధి చెందిన పద్య రీతుల లోని సంబంధాలను, ఉదాహరణగా కంద పద్యములు, సీస పద్యముల రూపకల్పనా మెళుకువలనూ అతి సరళంగా వివరించారు.

శబ్ద శాసనుడైన ఆదికవి నన్నయ, ఉభయకవి మిత్ర బిరుదాంకితుడైన తిక్కన, సూక్తి వైచిత్రి గుణసంపన్నుడైన ఎఱ్ఱన తెనిగించిన మహాభారతము లోని కొన్ని పద్యాలను తగిన రీతిన పాడి వినిపించి సాహితీ ప్రియులను అలరించారు. సహజ పండిత బిరుదాంకితుడైన పోతన,ప్రౌఢదేవరాయల ఆస్థాన పండితుడైన డింఢిమ భట్టు యొక్క కంచు ఢక్కా ను పగులగొట్టి కనకాభిషేకం చేయించుకున్న శ్రీనాధుడు, “కుమార సంభవం” రాసిన నన్నెచోడుడు ”వృషాధిప” శతక కర్త తొలి ద్విపద కవి పాల్కురికి సోమన, ”శ్రీగిరి శతకం” వ్రాసిన మల్లికార్జున పండితారాధ్యుడు, శ్రీకృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, తెనాలి రామకృష్ణ కవి వేములవాడ భీమకవి, బద్దెన, ధూర్జటి,వేమన, కాసులపురుషోత్తమకవి, మారదవెంకయ్య, ఏనుగులక్ష్మణకవి,కంచెర్ల గోపన్న మున్నగు కవులు పద్య నిర్మాణములకై తమ రచనలయందు యతి ప్రాసల వాడకంలో బహు విధ క్లిష్ట నియమములనేర్పరచి అట్టి పద్యరచన తో అనేక మహత్తర కావ్యములను వెలువరించిన వైనాన్ని సోదాహరణముగా వివరించారు చలపతి రావు గారు. ముఖ్యంగా గజేంద్ర మోక్షం ,ప్రహ్లాద చరిత్ర వంటి కావ్య రచనలో కవులు వాడిన శబ్దసౌందర్యం, శబ్దాలంకార ప్రయోగం గురించి వర్ణించే సమయంలో పద్యాలను లయ బద్ధంగా ఏకధాటిగా పాడుతున్న వీరి ధారణా శక్తికి శ్రోతలు ముగ్ధులైనారు. డాక్టర్ కొచ్చర్ల కోట చలపతిరావు ప్రసంగాన్ని మెచ్చుకుంటూ చంద్ర శేఖర్ పొట్టిపాటి, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి,సుబ్బు జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, కొండా తిరుమల రెడ్డి, జయకృష్ణ బాపూజీ, లెనిన్ వేముల, దయాకర్ మాడ, మాధవి లోకిరెడ్డి, కాశీనాధుని రాధ, రామ సీతామూర్తి,నిడిగంటి గోవర్ధనరావు వంటి సాహితీ ప్రియులు తమ స్పందనను తెలియ చేశారు.

తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి డాక్టర్ కొచ్చర్ల కోట చలపతిరావు గారికి సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి సన్మానించడం జరిగింది. ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈసన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ చలపతిరావు తన కృతజ్ఞతను వెలిబుచ్చారు.ఈ డల్లాస్ మహానగరంలో టాంటెక్స్ ద్వారా ఇక్కడి తెలుగు వారు తెలుగు భాషాసాహిత్యానికి చేస్తున్నసేవపై తానొక శతకాని రచించి లోకానికి చాటాలని భావిస్తున్నట్లు డాక్టర్ చలపతి రావు అన్నారు.

ఈ సమావేశపు ఆరంభంలో స్థానిక వక్తలు మాట్లాడారు. శ్రీనాధుడి చాటోక్తుల విశేషాలను వర్ణిస్తూ పద్యాలను చదివి శ్రీ జయకృష్ణ బాపూజీ కవుల చమత్కారాది రస పోషణను ప్రతి పద్యంలోని భావ సౌకుమర్యాన్ని అద్భుతంగా వివరించారు. గత 80 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ధారావాహిక ”మన తెలుగు సిరి సంపదలు”శీర్షికన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి పద ప్రహేళికల కార్యక్రమం రసవత్తరంగా సాగింది.ఈమాస పద్య సౌగంధం లో శ్రీమతి కాశీనాధుని రాధ నన్నె చోడ విరచిత కుమార సంభవములోని ”విష్ణు చిత్తుని వృత్తాంత ‘ పద్యాలను అద్భుతంగా పాడి సందర్భ సహిత వ్యాఖ్య చేయడం జరిగింది. గడచిన సంక్రాంతి సందర్భంగా సేకరించిన పిట్టలదొర చెప్పిన హాస్య కథను ప్రేరణగా పొంది ‘ఇలా ఎందరు యాచకులు భుక్తి కోసం ఎన్ని జానపద కళా రూపాలను నేర్చుకొని ప్రదర్శించి రోజులు గడుపుకుంటున్నారో కదా ‘అనే ఆర్ద్రచిత్తంతో ఆ పిట్టలదొర చెప్పిన కథనే సభలో ధారణ చేశారు లెనిన్ వేముల. సినీ రచయుత, దర్శకుడు జంధ్యాల జయంతి సందర్భంగా వారి స్మృతిలో వేటూరి రాసిన “అక్షర సంధ్యా వందనం” గుర్తు చేసి దానిలో తొలి భాగాన్ని చదివి వినిపించారు దయాకర్ మాడా.

సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తమ అధ్యక్షోపన్యాసంలో సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు.ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సమన్వయ కర్త మరియు పాలకమండలి ఉపాధిపతి దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు. ఈ సాహిత్య కార్యక్రమాన్ని పలువురు ప్రత్యక్షంగానూ మరికొంత మంది జూమ్ ద్వారానూ అనేక మంది సాహితీ ప్రియులు వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది .నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి, సమన్వయ కర్త దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events