ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ఫార్ములా కనిపెట్టారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ దావోస్‌లోని వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ సౌదీ అరేబియా, ఒపెక్ దేశాలను ముడి చమురు ధరలు తగ్గించాలని కోరారు. అలా క్రూడాయిల్ ధరలు తగ్గిస్తే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగిపోతుందన్నారు.
రెండోసారి అధ్యక్షుడిగా తాను బాధ్యతలు చేపట్టడంతో అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందని ట్రంప్ అన్నారు. యావత్ ప్రపంచ దేశాలకు శ్రేయస్సుతోపాటు శాంతి చేకూరుతుందని చెప్పారు. తమ దేశం మరింత సంపన్నం, శక్తిమంతం అవుతుందన్నారు. అసాధారణ రీతిలో విపత్తులకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు. ప్రపంచంలోనే అమెరికాకు అత్యధికంగా ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని, వాటిని తాము వాడేస్తామని వెల్లడించారు. పాత కాలం నాటి పది చట్టాలను రద్దు చేస్తానని హామీ ఇచ్చానని, దేశ ప్రజలకు చేయూతనిచ్చేందుకు పన్నుల్లో కోత విధిస్తానని చెప్పారు.