ఇకపై ప్రతీ ఏడాది ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకలు నిర్వహించాలని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది. అలాగే ప్రతీ ఏడాది ఉత్తమ చిత్రాలతో పాటు నటీనటులకు కూడా పురస్కారాలను ఆ రోజున ఇవ్వనుంది. తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లో భాగంగా నటీనటుల ఇళ్ళతో పాటు రాష్ట్రంలోని థియేటర్లలో తెలుగు సినిమా జెండా ఎగురవేయాలని తీర్మానించుకుంది. జెండా తయారీ బాధ్యతను పరుచూరి గోపాలకృష్ణకు అప్పగించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్భూషణ్ మాట్లాడుతూ ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఈ వేడుక చేయడం ఇదే తొలిసారి. ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తాం. పాత తరం కళాకారులను సన్మానిస్తాం అని అన్నారు. 1932లో హెచ్.ఎమ్.రెడ్డి దర్శకత్వంలో తొలి తెలుగు సినిమా భక్త ప్రహ్లాద ఇదే రోజున విడుదలైంది. ఈ సందర్భంగానే ఈ వేడుకను ఫిబ్రవరి 6నే జరపాలని నిర్ణయించుకున్నాం అని నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ చెప్పారు. ఈ సందర్భంగా మురళీ మోహన్ మాట్లాడుతూ రాజకీయ నాయకులకంటే సినిమా వాళ్లకే ప్రజల్లో ఆదరణ ఎక్కువ అన్నారు. రాజకీయ నాయకుడు పదవికాలం పూర్తయ్యాక ప్రజల్లో ఆదరణ ఉండదన్నారు. క్రీడాకారులకు కూడా ఆదరణ అంతంత మాత్రమేనన్నారు. కానీ సినీ నటులు మాత్రం ఎప్పుడు ప్రేక్షకుల హృదయాల్లో ఉంటారన్నారు. ఫిబ్రవరి 6న తెలుగు సినిమా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. మద్రాసులో ఉన్నప్పుడు తాము సినిమా కులమని గర్వంగా చెప్పుకునేవాళ్లమన్నారు. కాస్త ఆలస్యమైనా, ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషంగా ఉంది అని మోహన్ తెలిపారు.