ఉద్యోగులు పని చేస్తూ అలిసిపోతే ఆఫీస్ లోనే పెగ్గేయొచ్చు. మందు ఎక్కువై హ్యాంగోవర్ అయితే మరునాడు ఆఫీస్ కు లేటుగా రావొచ్చు. అవసరమైతే సెలవు తీసుకోవచ్చు. జపాన్ కు చెందిన ట్రస్ట్ రింగ్ కో అనే కంపెనీ ఉద్యోగులకు ఇలాంటి అసాధారణ ఆఫర్లు ఇస్తున్నది. ఒసాకా కేంద్రంగా పని చేసే ఈ చిన్న ఐటీ కంపెనీ, సంప్రదాయ ఆఫీస్ కల్చర్ ను బద్దలుకొడుతున్నది. కొత్త రూల్స్ తో ఉద్యోగులను ఆకట్టుకుంటున్నది. సాధారణంగా ఐటీ ఉద్యోగులకు జీతాలు భారీగా ఉంటాయి. ఈ చిన్న సంస్థ భారీ వేతనాలను ఇచ్చుకోలేదు.
దీంతో ప్రతిభ కలిగిన కొత్త ఉద్యోగులు తమ సంస్థలో చేరేలా, చేరిన వారు నాలుగు కాలాల పాటు కొనసాగేలా ఆకర్షించేందుకు తమ పని విధానాన్ని ఇలా మార్చేశామని కంపెనీ సీఈఓ తుకుయా సుగియురా చెప్తున్నారు. ఉద్యోగులకు కార్యాలయంలోనే ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని, తానూ అప్పుడప్పుడు వారితో కలిసి చిల్ అవుతానని అంటున్నారు. కొత్త ఉద్యోగులకు స్వయంగా డ్రింక్ ఇచ్చి కంపెనీలోకి ఆహ్వానిస్తానని చెప్తున్నారు. తమ విధానం వల్ల పని, వినోదం మధ్య సమతుల్యం ఏర్పడుతుందన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tulsi-300x160.jpg)