అమెరికాను ఆశ్రయం కోరుతున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతున్నదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. 2018లో దాదాపు 9 వేల మంది భారతీయులు అమెరికాను ఆశ్రయం కోరగా, 2023లో 51 వేల మంది కోరారని, అంటే ఐదేండ్లలో 466 శాతం పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ పట్టుబడిన వారు తమ సొంత దేశంలో హింసను కారణంగా చూపి ఆశ్రయం కోరేందుకు అమెరికా వలస విధానం అనుమతిస్తుంది.
అమెరికా తర్వాత కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో ఎక్కువ మంది భారతీయులు ఆశ్రయం కోరుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. 2023లో కెనడాను 11,500 మంది భారతీయులు ఆశ్రయం కోసం అభ్యర్థించినట్టు వెల్లడించారు. అయితే, అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) 2022 నాటి లెక్కల ప్రకారం అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయుల సంఖ్య భారీగా తగ్గింది. వీరి జనాభా 2016లో 5,60,000 ఉండగా 2022 నాటికి 2,20,000 ఉన్నట్టు డీహెచ్ఎస్ అప్పట్లో వెల్లడించింది.