రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై సోమవారం నాటికి మూడేళ్లు పూర్తయ్యింది. ఈ యుద్ధం ఆ రెండు దేశాలనే కాక మిగిలిన ప్రపంచంపైన కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముగింపు ఎన్నడో తెలియని అనిశ్చిత వాతావరణంలో ఉభయ దేశాల నాయకులు తమ సైనికుల వీరత్వాన్ని ఈ సందర్భంగా కీర్తించారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)లో చేరాలన్న ఉక్రెయిన్ ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా, 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు ప్రత్యేక సైనిక చర్యకు దిగడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. సులభంగా ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవచ్చనుకున్న రష్యాకు కీవ్ సేనల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నది.

పశ్చిమ దేశాల నుంచి ఉక్రెయిన్‌కు అందుతున్న కోట్లాది డాలర్ల సాయం కారణంగా పుతిన్‌కు విజయం అంత తొందరగా దక్కడం సాధ్యం కాలేదు. ఉక్రెయిన్‌లోని ఐదింట ఒక వంతు భూభాగాన్ని రష్యా సేనలు ఆక్రమించుకోగా యుద్ధ భూమిలో రెండు వైపులా లక్షా 50 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఈ యుద్ధం ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రష్యా దాడుల్లో అనేక భవనాలు, ఆనకట్టలు, రహదారులు, పాఠశాలలు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయి. యుద్ధంలో రష్యా కూడా తీవ్రంగా నష్టపోయింది. పశ్చిమ దేశాల ఆంక్షలతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది.
