
భూమి మీదకు సునీతా విలియమ్స్, విల్మోర్ సురక్షితంగా అడుగుపెట్టారు. బుధవారం తెల్లవారుజామున ఉదయం 3.27 గంటలకు క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడాలోని సముద్ర తీరంలో దిగింది. సునీతా విలియమ్స్ 9 నెలల తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీద చేరుకున్నారు. క్రూ డ్రాగన్ వ్యామనౌక ల్యాండింగ్ సక్సెస్ తో నాసా శాస్త్రవేత్తల సంబరాలు చేసుకున్నారు. సునీతా, విల్మోర్ లతో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలగ్జెండర్ గుర్బునోవ్ అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్నారు.

2024 జూన్ 5న స్టార్ లైనర్ వ్యోమనౌకలో సునీత, విల్మోర్ అంతరిక్షానికి వెళ్లారు. ఆ సమయంలో వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్న సాంకేతిక సమస్యతో గతంలో వ్యోమనౌక స్టార్ లైనర్ ఖాళీగా తిరిగొచ్చింది. సునీత, బుచ్ విల్మోర్ 288 రోజులు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. సునీత మూడో అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. 2006, 2012లోనూ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత ఆమెకే దక్కుతుంది.
