Namaste NRI

ఘనంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 212 వ సాహిత్య సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ‘నెల నెలా తెలుగు వెన్నెల’ 212 వ సాహిత్య సదస్సు ”డయాస్పోరా కథల పరిణామం” అంశంపై మార్చ్ 23 న  డాలస్ పురము నందు ఘనంగా నిర్వహించబడింది. తొలుత భక్త పురందర దాసు కీర్తన ” వేంకటా చల నిలయం..” ప్రార్ధన  గేయాన్ని చిరంజీవి సమన్విత మాడా  రాగయుక్తంగా ఆలపించడంతో సదస్సు ను ప్రారంభించడం జరిగింది. తరువాత ప్రముఖ కవి కీ శే  వడ్డేపల్లి కృష్ణ గారిచే వ్రాయబడి రికార్డు చేయబడిన”నెలనెలా  తెలుగువెన్నెల” గీతాన్నికూడా వినిపించడం జరిగింది.తదుపరి సంస్థ  సమన్వయ కర్త దయాకర్ మాడా సూచనమేరకు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు దివంగత   శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి  సంస్మరణార్ధం సాహితీప్రియులంతా ఒక నిముషం మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించడం జరిగింది.   

ముఖ్య అతిధి ప్రసంగానికి ముందు శ్రీ దయాకర్ మాడా ముఖ్య అతిథి ని సాహితీ ప్రియులకు పరిచయం చేయడం జరిగింది.తెలుగులో అనేక కథలను వ్రాసి సాహిత్య  సేవలందించిన శ్రీ భాస్కర్ పులికల్ ప్రసంగం ఆద్యంతం అద్భుతంగా సాగింది. ‘ నిర్మలాదిత్య ’ అన్న కలం పేరుతో గత ముప్పై ఏళ్ళు పైగా తెలుగులో కథలు వ్రాస్తున్నవీరు   ‘ డయాస్పోరా కథల పరిణామం ‘ మీద  దాదాపు గంట సమయం కొనసాగిన  తన ప్రసంగం లో  వారి రచనలకు వారి మేనమామ మధురాంతకం రాజారాం గారు ఎలా మంచి కథలు వ్రాయడానికి దోహదపడ్డారో , వీరు  1998 లో అమెరికా వలస రావడంతో తన  కథలుఎలా డయాస్పోరా కథలయ్యాయో అద్భుతంగా వివరించారు .అంతే గాక  డయాస్పోరా కథ నిర్వచనం, ఆ కథల సంఖ్యాపరంగా, విషయ పరంగా విశ్లేషణల వల్ల తెలిసిన విషయాలు భాస్కర్ గారు వీక్షకులతో పంచుకున్నారు.

అలానే డయాస్పోరా కథలను లబ్ధప్రతిష్టుల కథలతో బేరీజు వేయడం వల్ల తేలిన విషయాలు డయాస్పోరా కథలు పోతున్న మార్గం వాన్నెగాట్ కథా చిత్ర గ్రాఫ్ ల ద్వారా విశదీకరించిన విధానం  వీక్షకులకు బాగా నచ్చింది. ప్రసంగ ముగింపుగా ఇదివరకే అమెరికా దేశానికి వలస వచ్చిన ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, ఐరిష్, ఇటాలియన్ భాషల చరిత్ర, ప్రగతి ని వర్ణిస్తూ, తెలుగు భాష భవిషత్తు ఆశాజనకంగా చేసుకోవడానికి పలు సూచనలు చేశారు . ప్రసంగం తరువాత దాదాపు అరగంట సాగిన ప్రశ్నలు, సమాధానాల కార్యక్రమం అంతే ఆసక్తికరంగా జరిగింది.. భాస్కర్ గారు తన కథలు, రచయితగా తన ప్రయాణం లోని అంశాలు ఉదాహరణగా ఇస్తూ, సమాధానాలు మరింత రక్తి కట్టించడంతో మొత్తం కార్యక్రమం జయ ప్రదమైంది  శ్రీ భాస్కర్ పులికల్  ప్రసంగాన్ని మెచ్చుకుంటూ  డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, డాక్టర్  పుదూరు జగదీశ్వరన్ , లెనిన్ వేముల, దయాకర్ మాడా,    శ్రీమతి కాశీనాధుని రాధ, శ్రీ హరి చరణ  ప్రసాద్,  శ్రీమతి విజయ మామునూరి  శ్రీ పృథ్వీ తేజ శ్రీనవీన్ గొడవర్తి .నిడిగంటి గోవర్ధనరావు  వంటి సాహితీ ప్రియులు  తమ స్పందనను  తెలియ చేశారు.   తరువాత ఉత్తర  టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్  ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున సంస్థ సమన్వయ కర్త శ్రీదయాకర్ మాడ నేటి ముఖ్య అతిథి శ్రీ భాస్కర్ పులికల్ గారికి టాంటెక్స్  సంస్థ తరపున సన్మాన పత్ర జ్ఞాపికను చదివి వినిపించి  సన్మానించడం జరిగింది.  ఇంతమంది సాహితీప్రియుల మధ్య తనకు జరిగిన ఈసన్మానం  అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని పేర్కొంటూ శ్రీ భాస్కర్ పులికల్  తన కృతజ్ఞతను వెలిబుచ్చారు.      టాంటెక్స్  సంస్థ ద్వారా తెలుగు భాషాసాహిత్యానికి చేస్తున్న సేవ చాలా గొప్పదని ఆయన ప్రశంసించారు.

సాహితీ ప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 82  మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న  ధారావాహిక ”మనతెలుగుసిరిసంపదలు”చాలా బాగా జరిగింది. చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు .పొడుపు కథలు ,నానార్ధములు  సహా దాదాపు యాభై  ప్రక్రియల లో ని వైవిధ్య భరితమైన తెలుగు భాషా పదసంపదను స్పృశించడం, అక్షర పద భ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారిని ప లువురు ప్రశంసించడం జరిగింది.      

 ఈమాస పద్య సౌగంధం లో శ్రీమతి కాశీనాధుని రాధ పోతన భాగవతము దశమ స్కందమునుండి ”తనువున నంటిన ధరణీపరాగంబు-పూసిన నెఱిభూతి పూఁత గాఁగ…” ఆదిగా గల పద్యములను అద్భుతంగా  పాడి   హరి హర బేధములేదను పోతనగారి భక్తి పూర్వక రచనాశైలిని విశిష్టంగా కొనియాడారు శ్రీమతి కాశీనాధుని రాధ గారు. శ్రీ లెనిన్ వేముల తరువాతి అంశాన్ని వేదికలో ప్రవేశపెడుతూ  భారత స్వాతంత్య్ర  సంగ్రామంలో 94 ఏళ్ళ క్రితం ఈ రోజు అంటే 1931, మార్చి 23 ఒక  చీకటి రోజు   గా ఎందుకు చరిత్రలో నిలిచిందో   గుర్తు చేశారు. శ్వేతజాతి తమ దురహంకారంతో విప్లవీరుల  గొంతుకలు పైశాచికంగా మూయించి , నాడు భగత్ సింగ్  ,  సహ విప్లవ కారులు రాజ్ గురు , సుఖదేవులకు ఉరిశిక్ష అమలు చేసి స్వాతంత్య్ర  సాధన కాంక్షను శ్వేతజాతి భారతీయులలో చెరపి వేయ   ప్రయత్నించిందని, కానీ ఆ నవయువకుల త్యాగాలు తరాలు గడచినా ఉత్తేజాన్ని కలుగజేస్తూనే ఉంటాయన్న   “తప్పటడుగులా ప్రాయమందున”  అన్న గోరటి వెంకన్న గేయాన్ని గుండెలు నిండిన ఆర్ద్రతతో వినిపించారు.

 తరువాత డాక్టర్  పుదూరు జగదీశ్వరన్ గారు   ఏనుగు లక్ష్మణ కవి రచించిన పద్యాలు పాడి  ,తాను చదువుకొనే సమయములో తనకు నచ్చిన భర్తృహరి  సుభాషితాలు ,గంగను పైకి తెచ్చిన భగీరథుని ప్రయత్నం ,విజయ విలాసము లోని కొన్ని సన్నివేశాలు ఇంకా 18  వ  శతాబ్ది నాటి చారిత్రక మరియు  సాహిత్యపరమైన అనేక అంశాలను అద్భుతంగా ఆవిష్కరించారు డాక్టర్ పుదూరు జగదీశ్వరన్ గారు.                      

ఈ సాహిత్య కార్యక్రమానికి  సంస్థ తక్షణ పూర్వాధ్యక్షులు శ్రీ సతీష్ బండారు ,సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ; డాక్టర్ పుదూరు జగదీశ్వరన్,సంస్థ ఉత్తరాధ్యక్షులు శ్రీమతి మాధవి లోకిరెడ్డి ,ఇంకా  శ్రీ హరి సింగం ,  శ్రీ హరి చరణ ప్రసాద్ , శ్రీమతికాశీనాధుని రాధ , శ్రీ  నగేష్  పులిపాటి, శ్రీమతి శ్యామల ,శ్రీమతి విజయ మాములూరి ,   లెనిన్ తాళ్లూరి ,లెనిన్  బంద, లెనిన్ వేముల , మాధవరావు  గోవిందరాజు ,  శివ ,శ్రీ నవీన్ గొడవర్తి ,పృథ్వీ తేజ,  గోవర్ధన రావు నిడిగంటి వంటి  అనేక మంది సాహితీ ప్రియులు   వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది . ఉత్తర  టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్   పాలక మండలి ఉపాధిపతి మరియు వేదిక సమన్వయ కర్త  శ్రీ దయాకర్  మాడా వందన సమర్పణ చేస్తూ   సంస్థ కార్యవర్గానికి, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన  ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు  శ్రీ చంద్రశేఖర్  పొట్టిపాటి, ఉత్తరాధ్యక్షులు శ్రీమతి మాధవి లోకిరెడ్డి, సంస్థ  సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడా సంస్థ పాలక  మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు   అభినందనీయులు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events