Skip to main content

Namaste NRI

వారి వీసా రద్దు, దేశ బహిష్కరణ.. తప్పని ఇబ్బందులు

అమెరికాకు వెళ్లి చదువుకుని తమ డాలర్‌ డ్రీమ్స్‌ను నెరవేర్చుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థులకు ట్రంప్‌ నిర్ణయాలు ఇబ్బందికరంగా మారాయి. అక్రమ వలసదారులపై అక్కడి అధికారులు ఉక్కుపాదం మోపుతుండగా ఎక్కడ పట్టుబడతామో అని ఇప్పటికే మన విద్యార్థులు చాలా మంది పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ను మానేశారు. మరోవైపు స్టూడెంట్‌ వీసాల జారీని అమెరికా నిలిపివేసింది. ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంపై పలు వర్సిటీల్లో ఆందోళనలు, కొన్ని వర్సిటీల్లో ఉగ్రవాదానికి మద్దతుగా చర్యలు ఉన్నాయని అమెరికా భావిస్తున్నది. దీంతో విదేశీ విద్యార్థుల లింక్డ్‌ ఇన్‌ సహా ఇతర సోషల్‌ మీడియాల ప్లాట్‌ఫామ్‌ల ఖాతాలను అమెరికా అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టూడెంట్‌ వీసాల జారీని అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది. వీసా కోసం దరఖాస్తు చేసిన విద్యార్థుల్లో ఎవరైనా తమ దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారా అనేది అధికారులు వెరిఫికేషన్‌ చేయనున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా లేరని భావిస్తేనే విదేశీ విద్యార్థులను అమెరికాలో ఉండేందుకు అర్హత కల్పించనున్నారు.

మరోవైపు తమ దేశంలో ఉండి చట్ట విరుద్ధ పనుల గురించి ఎవరైనా చాటింగ్‌ చేసి ఉంటే వారిపైనా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. దీంతో భారత విద్యార్థుల్లో ఆందోళన నెలకొన్నది. అయితే కొత్త వీసా అప్లికేషన్‌లో మార్పులు చేసి త్వరలోనే వీసా ఇంటర్వ్యూలకు అమెరికా పిలవనున్నట్టు కన్సల్టెన్సీ వర్గాలు తెలిపాయి. అయితే మన దగ్గర వీసాలకు దరఖాస్తు చేసిన వాళ్లు తదుపరి ప్రకటన వెలువడే లోపు వీసా పత్రాల సమర్పణను పూర్తి చేయాలని వారు సూచిస్తున్నారు. అదే సమయంలో యూఎస్‌ స్టూడెంట్‌ వీసాపై మాత్రమే నమ్మకం పెట్టుకొని సమయం వృథా చేయొద్దని,  యూరప్‌ దేశాల్లో చదవులు, అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events