సుహాస్‌కు జోడీగా మాళవిక మనోజ్ నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ఓ భామ అయ్యో రామ. రామ్ గోధల దర్శకుడు. హరీష్ నల్ల నిర్మాత. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మాళవిక మనోజ్ విలేకరులతో ముచ్చటించారు. తమిళంలో జో అనే సినిమా చేశాను. అందులో నా అభినయం చూసే ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే నేనూ ఓకే చెప్పాను. చాలా భిన్నమైన కథ ఇది. ఈ చిత్రంలో నా పాత్ర ఎంతో ఆధునికంగా ఉంటుంది. సత్యభామ అనే పాత్రలో కనిపిస్తాను. అందర్నీ అలరించే పాత్ర నాది. నా రియల్ లైఫ్‌కు ఎలాంటి పోలిక లేని పాత్ర సత్యభామ. మోడ్రెన్‌గా, హైపర్‌గా, యాటిట్యూడ్‌తో ఉండే పాత్ర అని తెలిపారు.

నా రియల్‌లైఫ్‌కి ఏ మాత్రం కంపారిజన్ లేని పాత్ర ఇది. తెలుగు రాకపోయినా, భావాన్ని అర్థం చేసుకొని నటించాను. టాలీవుడ్‌లో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పనిచేసే వారిలో వృత్తి పట్ల నిబద్ధత ఎక్కువ. వారందరి సహకారం వల్లే ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించగలిగాను అని చెప్పారు మాళవిక మనోజ్. హీరో సుహాస్ వెరీ నైస్ పర్సన్ అనీ, సెట్‌లో సినిమాకోసం మాత్రమే మాట్లాడతారని, ఈ సినిమాలో తమ కెమిస్ట్రీ బావుంటుందని, ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో ఫీల్ కొత్తగా ఉంటుందని మాళవిక మనోజ్ పేర్కొన్నారు. వైవిధ్యమైన పాత్రలతో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుందని, నచ్చిన కథల్ని మాత్రమే ఎంచుకుంటానని, కంఫర్ట్ జోన్‌లోనే సినిమాలు చేస్తానని తెలిపారు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది.
















