పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా జ్యోతి కృష్ణ తెరకెక్కించిన చిత్రం హరిహర వీరమల్లు. ఏ.ఎం.రత్నం నిర్మించారు. నిధి అగర్వాల్ కథానాయిక. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాల్ని పెంచింది. 17వ శతాబ్దం నాటి మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చారిత్రక యోధుడు వీరమల్లుగా పవన్‌కల్యాణ్ కనిపించనున్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, న్యాయం కోసం, ధర్మం కోసం ఓ వీరుడి పోరాటానికి దృశ్యరూపంలా సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.

తాజాగా ఈ సిని మా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది. యు/ఏ సర్టిఫికెట్ లభించింది. పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని, అమెరికాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, ఈ నెల 20న వైజాగ్‌లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తామని చిత్రబృందం పేర్కొంది. అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషుసేన్‌గుప్తా తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: ఏ.దయాకర్ రావు, దర్శకత్వం: జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి.
















