విశాఖకు మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలు రాబోతున్నాయని, భవిష్యత్ పెట్టుబడులు, అవసరాలకు తగ్గట్లుగా విశాఖ మాస్టర్ ప్లాన్ ఉండాలని అధికారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మౌలిక వసతులకు లోటు లేకుండా ప్రణాళికలు అమలు చేయాలని అన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ భేటీ జరిగింది. రాష్ట్రంలో రూ.20వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 కంపెనీల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా రాష్ట్రంలో 50వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

రాష్ట్రంలో రూ.16,466 కోట్లతో సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ సంస్థ డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. విశాఖపట్నంలో మొదటిదశలో ఆ సంస్థ రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో 200 మందికి ఉపాధి లభించనుంది. రెండో దశలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుండగా 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.

విశాఖ మధురవాడలో సాత్వా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,500కోట్ల పెట్టుబడులు పెడుతుండగా, 25,000 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండాడ (విశాఖ)లో రూ.1,250 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో మొత్తంగా విశాఖలో 15,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధురవాడలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తద్వారా 10,000 ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.















