Namaste NRI

తయారీ రంగంలో దేశానికి దిక్సూచిలా తెలంగాణ: మంత్రి శ్రీధర్‌ బాబు

తెలంగాణను గ్లోబల్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తోషిబా ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్స్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ (టీటీడీఐ)లో కొత్తగా నిర్మించిన కోర్‌ ప్రాసెసింగ్‌, సర్జ్‌ అరెస్టర్‌ లైన్‌ సెంటర్‌లను ఆయన మంత్రి వివేక్‌ వెంకటస్వామితో కలిసి ప్రారంభించారు. ఈహెచ్‌వీ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ప్లాంట్‌ విస్తరణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సీఎం రేవంత్‌ రెడ్డి జపాన్‌ రాజధాని టోక్యో పర్యటనలో టీటీడీఐతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని, దీని ప్రకారం రూ.562 కోట్ల పెట్టుబడితో తోషిబా, తెలంగాణలోని తమ సంస్థల్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుందని, ఇందులో భాగంగా ఈ సెంటర్‌లను ప్రారంభించామని, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ప్లాంట్‌ విస్తరణకు భూమి పూజ చేశామని చెప్పారు. దీంతో మూడేళ్లలో కొత్తగా 250కి పైగా ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.

తోషిబా పెట్టుబడులతో తెలంగాణ బ్రాండ్‌ మరింత విశ్వవ్యాప్తమవుతుందని అన్నారు. తయారీ రంగంలో దేశానికి దిక్సూచిలా మారిన తెలంగాణలో కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతోనే అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని చెప్పారు. కొందరు కావాలని పని గట్టుకొని వాటిని ఉత్తుత్తి ఎంవోయూలు అంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ విమర్శలకు తోషిబా కంపెనీనే దీటైన సమాధానమిస్తుందని అన్నారు. మంత్రి వివేక్‌ వెంకట స్వామి మాట్లాడుతూ జపనీస్‌ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్రానికి మరిన్ని కొత్త పెట్టుబడులు వస్తున్నాయని, ఫలితంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు.

Social Share Spread Message

Latest News