ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితికి మంగళవారం సతీమణి మెలానియాతో కలిసి వెళ్లిన ఆయన, జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో ప్రసంగించారు. అయితే, జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లే క్రమంలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఐరాసలో జరిగిన వరుస సాంకేతిక ప్రమాదాలు ఉద్దేశపూర్వక విధ్వంసక చర్యలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయా ఘటనలపై సీక్రెట్ సర్వీస్ దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

ఐరాసలో తనకు అవమానం జరిగిందని పేర్కొన్నారు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు దురదృష్టకర ఘటనలు జరిగినట్లు చెప్పారు. ఐరాసలో ప్రసంగించేందుకు వెళ్తుంటే ఎస్కలేటర్ ఆగిపోయిందన్నారు. ఆ తర్వాత టెలిప్రాంప్టర్ పని చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. దాదాపు 15 నిమిషాల తర్వాత అది పనిచేయడం ప్రారంభమైనట్లు చెప్పారు. ఈ మూడు ఘటనలు దురుద్దేశపూర్వకంగానే కనిపిస్తున్నాయన్నారు. ఆయా ఘటనలపై విచారణకు ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు.
















