ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సినీనటుడు అక్కినేని నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన ఆయన సీఎంతో పలు విషయాలు మాట్లాడారు. మద్యాహ్నం అక్కడే జగన్, నాగార్జున కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన శ్రేయోభిలాషి అని, కలిసి చాలా రోజులు అయినందున మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చానని తెలిపారు. రాజధాని ప్రాంతమైన విజయవాడకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎంతో ఏం చర్చించారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మాట దాటవేసి లాంజ్‌లోకి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్, నిర్మాత నిరంజన్ రెడ్డి, నిర్మాత ప్రీతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.