సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ పేరు మారింది. తాము కొత్తగా అందుబాటులోకి తీసుకురాబోయే మెటావర్స్ సాంకేతికత మీదుగా ఫేస్‌బుక్‌కు మెటా అని పేరు మార్చినట్టు సంస్థ సీఈవో జుకర్‌బర్గ్ ప్రకటించారు. అయితే ఫేస్‌బుక్‌తోపాటు కంపనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు మెటా మాతృసంస్థగా ఉంటుందన్నారు. వర్చువల్/ ఆగ్యుమెంటెడ్ రియాలిటీలో వినియోగదారులు సంభాషించుకొనేలా ఫేస్‌బుక్ త్వరలో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిని మెటావర్స్‌గా చెప్తున్నారు. అయితే సమాచార దుర్వినియోగం, సమాచార భద్రతపై ఆందోళనలు విద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నదన్న ఆరోపణల నేపథ్యంలో, ఈ విమర్శల నుంచి దృష్టి మర్చల్చేందుకే జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ పేరును మార్చారని ఆరోపణలు వస్తున్నాయి.
దశాబ్ద కాలంగా సోషల్ మీడియా ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా విస్తృతమైంది. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజల జీవనంలో సోషల్ మీడియా భాగమైంది. అందులో ఫేస్‌బుక్ ప్రధానమైంది. కాగా, ఫేస్‌బుక్ పేరు మార్పు సోషల్ మీడియా విభాగంలో కీలక పరిణామంగా నెటిజన్లు చెప్పుకుంటున్నారు.