Namaste NRI

మంథా తుఫాన్ బాధితులకు తానా మానవతా సహాయం – ఒంగోలులో అన్నదానం కార్యక్రమం

ప్రకృతి విపత్తు మంథా తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సాయంగా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మానవతా సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ లావు, మరియు కార్యదర్శి రాజా కసుకుర్తి సహకారము మరియు మార్గదర్శకత్వంలో, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని దత్తాత్రేయ కాలనీ మరియు బలరాం కాలనీ ప్రాంతాలలో సుమారు 600 మందికి అన్నదానం నిర్వహించారు. బాధితులకు వేడి భోజనం, అరటి పండ్లు, వాటర్ బాటిల్స్ అందజేసి తానా సేవా దృక్పథాన్ని మరోసారి ప్రదర్శించింది.

ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ, “ప్రకృతి విపత్తుల సమయంలో మనసున్న వారు ముందుకు రావడం సమాజం బలాన్ని చూపిస్తుంది. తానా సహకారంతో ఈ రోజు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అన్నదానం చేయగలిగాం,” అని తెలిపారు. భవిష్యత్తులో కూడా వరదలు లేదా ఇతర విపత్తుల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తానా మరియు సూర్యశ్రీ ట్రస్ట్ కలిసి సహాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ సహనాజ్, కార్యదర్శి షేక్ సర్దార్ భాష, గౌరవ సలహాదారుడు మండవ సుబ్బారావు, జనసేవ శ్రీనివాస్, మేడిశెట్టి సుబ్బారావు, కల్లూరి లక్ష్మయ్య మరియు ఇతరులు పాల్గొన్నారు.
“కేవలం విదేశాల్లోనే కాదు, స్వదేశంలో కూడా ప్రతి అవసరమైన వ్యక్తికి సహాయం చేయడమే.” మా సేవల లక్ష్యం అని తానా ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.

Social Share Spread Message

Latest News