
ఉద్రిక్తతలను పరిష్కరించుకునేందుకు పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ దేశాల మధ్య కీలకమైన శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో చర్చల ప్రారంభానికి ముందే పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేటి చర్చలు ఫలించకపోతే తాలిబన్ల తో యుద్ధానికి వెళ్లాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. శాంతిచర్చలు విఫలమైతే ఇరుదేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయన్నారు. మా వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. శత్రువులు మమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారన్న దాన్ని బట్టి మా ప్రతిస్పందన కూడా తీవ్రస్థాయిలో ఉంటుంది. చర్చలు ఫలించకపోతే యుద్ధం జరిగి తీరుతుంది అని ఖవాజా వ్యాఖ్యానించారు. మిలిటెంట్లకు కాబూల్ ఆశ్రయం కల్పిస్తోందని, సీమాంతర దాడులను ప్రోత్సహిస్తోందని పాక్ మంత్రి దుయ్యబట్టారు.
















