Namaste NRI

తాల్‌ ఆధ్వర్యంలో ఘనంగా చిల్డ్రన్స్‌ డే వేడుకలు

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ లండన్‌ (తాల్‌) ఆధ్వర్యంలో లండన్‌లోని ఫెల్థామ్‌ అసెంబ్లీ హాల్‌లో ఘనంగా చిల్డ్రన్స్‌ డే వేడుకలు జరిగాయి. తాల్‌ కల్చర్‌ సెంటర్‌ ( టీసీసీ) విద్యార్థులతో పాటు ఇతర బాలబాలికలు ఇందులో పాల్గొన్నారు. క్లాసికల్‌ సంగీతం, సంప్రదాయ, సినీ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన తెలుగు వక్తృత పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. తెలుగు భాషను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహించారు. దీనిపై తెలుగు మాతృభాషాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ వేడుకకు హౌన్స్‌లో మేయర్‌ కౌన్సిలర్‌ ఎమీ క్రాప్ట్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తాల్‌లో సేవలు అందిస్తున్న వాలంటీర్లందరికీ మేయర్‌ ధన్యవాదాలు తెలిపారు. తాల్‌ వంటి సంస్థలు వైవిద్యాన్ని సెలబ్రేట్‌ చేస్తూ తరువాతి తరానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. సంస్కృతిని పోషించే ఇలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక భిన్నత్వాన్ని కలిగి ఉన్న లండన్‌ వంటి మహా నగరానికి ఆయువుపట్టు అని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వెంకట్‌ తోటకూర, కల్చరల్‌ టీమ్‌తో పాటు ఇతర వాలంటీర్లకు కల్చర్‌ ట్రస్టీ శ్రీదేవి అలెడ్డుల కృతజ్ఞతలు తెలిపారు. తాల్‌ కల్చర్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న తెలుగు భాషా సాంస్కృతిక పాఠాల గురించి టీసీసీ ట్రస్టీ అశోక్‌ మడిశెట్టి వివరించారు. క్రిస్మిస్‌, సంక్రాంతి, బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ వంటి రానున్న ఈవెంట్లలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చైర్మన్‌ రవి సబ్బా, ఇతర ట్రస్టీలు అనిల్‌ ఆనంతుల, కిరణ్‌ కప్పెట, వెంకట్‌ నీల, రవి మాచెర్ల, సత్య పెద్ది రెడ్డి పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events