తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి వచ్చే ఏడాది జూలై 31న జరగనున్న 19వ ఆటా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం తో అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు రావాలని కోరారు. అలాగే 19వ మహాసభల లక్ష్యాలు, కార్యక్రమాల రూపురేఖలను ముఖ్యమంత్రికి వివరించారు. యువత భాగస్వామ్యం, వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆటా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఆటా కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాసులు రాష్ట్ర అభివృద్ధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. విద్య, ఐటీ, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడిలో ఆటా వేదికగా నిలుస్తోందని అన్నారు. అలాగే ఈ మహాసభలు తెలుగు ఐక్యతను ప్రపంచస్థాయిలో చాటేలా నిర్వహించేందుకు తమ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, కో-చైర్ నరసింహ ద్యాసాని, సాయి సుధిని, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, ఇతర ప్రతినిధులు శ్రీధర్ బాణాల,కాశీ కొత్త, రామకృష్ణ అలా, సుధీర్ దామిడి, శ్రీధర్ తిరిపతి, పరమేష్ భీంరెడ్డి, రాజు కక్కెర్ల, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సిరెడ్డి గడ్డికోపుల, విష్ణు మాధవరం, హరీష్ బత్తిని, సుమ ముప్పాల, వేణు నక్షత్రం, లక్ష్ చేపూరి, అనంత్ పజ్జూర్, అరవింద్ ముప్పిడి, తిరుమల్ మునుకుంట్ల, మీడియా సలహాదారు ఈశ్వర్ బండా తదితరులు వున్నారు.















