చిరంజీవి హీరోగా రూపొందిన కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మెగాబ్లాక్బస్టర్ థాంక్ యు మీట్లో అనిల్ రావిపూడి మాట్లాడారు. నా కెరీర్లో చాలా వేగంగా పూర్తి చేసిన స్క్రిప్ట్ ఇది. కేవలం పాతిక రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేశాను. అందుకే ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే ఇస్తాను. దాని కారణం మెగాస్టారే. ప్రేక్షకులు ఆయనపై పెంచుకున్న అభిమానమే ఈ స్క్రిప్ట్‌కి ప్రేరణ. నవరసాలను అద్భుతంగా, అందంగా తనదైన శైలిలో ఆవిష్కరించగల అద్భుతమైన మహానటుడు చిరంజీవి. ఆయనలోని ప్రత్యేకతలన్నింటినీ తలచుకుంటూ, వాటిని కలుపుకుంటూ ఈ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాను. అందుకే ఇంత వేగంగా పూర్తిచేయగలిగాను. నా ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ నచ్చినందుకు ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతిని కూడా నాకు మెమొరబుల్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని అన్నారు.

ఈ సినిమాతో బాక్సాఫీస్ కాస్తా బాస్ ఆఫీస్ అవుతుందని రెండు నెలల క్రితమే అనిల్‌తో చెప్పానని, అనుకున్నట్టే అద్భుతమైన విజయాన్ని ఈ సినిమా అందుకున్నదని నిర్మాత సాహు గారపాటి ఆనందం వెలిబుచ్చారు. ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉందని, నిర్మాతగా ఇది తన తొలి సినిమా అనీ, మెగాస్టార్ కూతురుగా ఆయన పేరు నిలబెట్టాననే అనుకుంటున్నానని చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల అభిప్రాయపడ్డారు. ఇంకా సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో కూడా మాట్లాడారు.















