Namaste NRI

దావోస్‌: TS CM రేవంత్ రెడ్డి ఫాలోఅప్‌ సమావేశం నిర్వాహణ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ఫోరం ప్రతినిధులు

ప్రతి ఏటా దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు అనంతరం, దానికి ఫాలోఅప్‌గా హైదరాబాద్‌లో జూలై – ఆగస్టు నెలల్లో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు ప్రతినిధుల ముందు ప్రతిపాదించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులోని తెలంగాణ పెవిలియన్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌కు చెందిన ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ , ఫోరం డిజిటల్ ఎకానమీ స్ట్రాటజీ హెడ్ మంజు జార్జ్ తో సమావేశమైంది.

తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి ఉన్న సానుకూల అవకాశాలు, అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, విధానాలను ప్రపంచానికి చూపించాలన్న ఆలోచనలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పంచుకున్నారు. అందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో తదుపరి చర్యలపై సమావేశం నిర్వహించి సమీక్షించడం ద్వారా పరస్పర సమన్వయం మరింత పెరుగుతుందని చెప్పారు.

జూలై – ఆగస్టు నెలల్లో ఫాలోఅప్‌ సమావేశం నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనపై ఫోరం ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. దావోస్ సదస్సులో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలోఅప్ సమావేశం ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఆ విషయంలో సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని జెరెమీ జర్గెన్స్ చెప్పారు. చైనాలో ప్రతి ఏడాది ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, అలాగే సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని తెలిపారు.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్, లక్ష్యాలను ముఖ్యమంత్రి సమావేశంలో సమగ్రంగా వివరించారు. తెలంగాణ విజన్ లక్ష్యాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లో తాము భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపారు.

హైదరాబాద్‌లో జరిగిన బయోఆసియా 2024 సందర్భంగా ప్రారంభించిన C4IR తెలంగాణ పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ భారత్‌లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ అదేనని గుర్తు చేశారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు జోన్ల నమూనాను వివరించారు. CURE, PURE, RARE ఆర్థిక అభివృద్ధి వ్యూహంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు. ఇది నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా, దేశంలో సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్ సిటీగా నిలుస్తుందని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్‌కు ఉన్న అనుకూలతలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events