
ఆయుధాలు వీడటానికి అంగీకరించకపోతే సైనిక చర్యను ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల సందర్భంగా గాజాలో శాంతి స్థాపనే లక్ష్యంగా 35 దేశాల మద్దతుతో శాంతి మండలిని (పీస్ బోర్డు) ట్రంప్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తూ హమాస్ నిరాయుధీకరణ విషయంలో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేశారు. మరో యుద్ధాన్ని పరిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడం అత్యంత క్లిష్టంగా మారినట్లు తెలిపారు. హమాస్ నిరాయుధీకరణే తాము కొత్తగా రూపొందించిన శాంతి మార్గదర్శకాల్లో మొదటిదని ఆయన చెప్పారు. ఆయుధాలను వదిలిపెట్టేందుకు హమాస్ అంగీకరించకపోతే సైనిక చర్య తప్పదని ట్రంప్ హెచ్చరించారు. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక యుద్ధాలను ముగించానని, అతి త్వరలోనే మరో పరిష్కారం రానున్నదని ఆయన చెప్పారు.















