గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు తమదైన ముద్ర వేశారు. 11 మంది తెలుగు ప్రముఖులు పద్మ అవార్డులను కైవసం చేసుకున్నారు. అందులో తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉన్నారు.దేశంలో మొత్తం 131 మంది ఈ అత్యున్నత పౌర పురస్కారాలకు ఎంపికయ్యారు. ఇందులో దివంగత బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ,కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద సహా
ఐదుగురికి దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించారు. కేన్సర్ వ్యాధి వైద్య నిపుణులు నోరి దత్తాత్రేయుడు , ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి , ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృత రాజ్ సహా 13 మందిని పద్మభూషణ్ కు ఎంపికచేశారు.


తెలుగు సినిమా నటులు రాజేంద్రప్రసాద్, మాగంటి మురళీమోహన్ సహా 113 మందికి పద్మశ్రీ అవార్డులు లభించాయి.77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కళలు, శాస్త్ర సాంకేతిక, సామాజిక, ప్రజా సంబంధాలు, ఇంజనీరింగ్, పరిశ్రమలు, వాణిజ్య, వైద్యం, సాహిత్యం, క్రీడలు, విద్య, సేవా రంగాలలో విశేష సేవలు అందించిన 131 మందికి ఈ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో రాష్ట్రపతి భవన్ లో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పౌర పురస్కారాలను విజేతలకు ప్రదానం చేస్తారు.















