
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్భంధించి, ఆపహరించిన తరువాత కూడా ఆ దేశంపై అమెరికా బెదిరింపులను ఆపడం లేదు. వెనిజులాలోని నూతన నాయకత్వం తమ ఆదేశాల ప్రకారం నడుచుకోకపోతే ఆ దేశంపై కొత్తగా సైనిక చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తాజాగా హెచ్చరించింది. ఈ హెచ్చరికలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చేశారు. మదురో నిర్భంధం తరువాత కూడా అవసరమైతే వెనిజులాలో అదనపు బలగాలను ప్రయోగించడానికి ట్రంప్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వెనిజులా కొత్త నాయకత్వం తమ వినడం కోసం వినియోగించే ఇతర పద్ధతులు విఫలమైతే బలప్రయోగానికి అమెరికా సిద్ధంగా ఉందని రూబియో స్పష్టం చేశారు. అలాగే, ప్రస్తుతం వెనిజులాపై అమెరికా యుద్ధం చేయడం లేదని, అక్కడ అమెరికా సైనికులు లేరని అన్నారు. వెనిజులాలో శాంతిభద్రతలకు సహాయం చేయడానికి చేసిన ఆపరేషన్‌గా తమ దాడిని రూబియో సమర్ధించుకున్నారు.















