మహారాష్ట్ర లోని బారామతి విమానం కుప్పకూలి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. అయితే ఈ ప్రమాదం మన దేశంలో చోటుచేసుకోలేదు. కొలంబియాలోని ఈశాన్య ప్రాంతంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ఎంపీ సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సిబ్బంది, 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఈశాన్య కొలంబియాలోని శాంటాడెర్ రీజియన్‌లోని గ్రామీణ ప్రాంతంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు.

విమానం అక్కడి కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 11.42 గంటలకు కుకుటలోని కామిలో డజా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరింది. అదేరోజు మధ్యాహ్నం 12.05 గంటలకు ఒకానాకు చేరాల్సి ఉంది. కానీ ఉదయం 11.54 గంటలకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలోని 15 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో కాంగ్రెస్ ఎంపీ డియోజీన్స్ క్వింటెరో కూడా ఉన్నారు. క్వింటెరో ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయినప్పటి నుంచే ఆయనతో, ఆయన అసిస్టెంట్‌తో కాంటాక్ట్స్ తెగిపోయాయని, ఆయన కమ్యూనికేషన్స్ టీమ్ తెలిపింది.















