అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. యూఎస్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా డగ్ బర్గమ్‌ను ట్రంప్ నియమించారు. అయితే బర్గమ్ భార్య చాలా అందంగా ఉంటుందని, అందుకే ఆయనకు పదవి ఇచ్చానని ట్రంప్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో బర్గమ్ భార్య కేథరిన్ అక్కడే ఉండటం గమనార్హం. బర్గమ్ నియామకంపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీశాయి.మాదక ద్రవ్యాల కట్టడి లక్ష్యంగా ఓ కార్యనిర్వహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. ఓవల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దానికి సంబంధించిన వివరాలను ట్రంప్ వెల్లడించారు.

ఈ సందర్భంగా బర్గమ్‌ను అంతర్గ వ్యవహారాల శాఖ మంత్రిగా నియమించడం వెనుక గల కారణాన్ని వివరించారు.
ఎన్నికల ప్రచార వీడియోలో బర్గమ్ దంపతులు గుర్రపు స్వారీ చేస్తున్న దృశ్యాన్ని చూశానని ట్రంప్ తెలిపారు. అందులో ముందుగా బర్గమ్ భార్య కేథరిన్ తన కంటపడిందని చెప్పారు. అందులో ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించారని అన్నారు. ఆ వీడియో చూసి వెంటనే ఎవరు అని అడిగాను, అది ఆయన గురించి కాదు, ఆమె గురించే అని వ్యాఖ్యానించారు. అనంతరం తన సహాయకులు దంపతుల వివరాలు చెప్పారని అన్నారు. అప్పుడే బర్గమ్‌ను తన కేబినెట్‌లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.















