మహిళా సాధికారత, అభివృద్ధి మరియు నాయకత్వ వికాసమే లక్ష్యంగా అమెరికాలో విజయవంతంగా కొనసాగుతున్న ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్- WETA సేవలు ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి.


హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా అట్టహాసంగా జరిగిన వెటా ఇండియా ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్యఅతిథులుగా హాజరైన మంత్రులు పొన్నం ప్రభాకర్ , వివేక్ వెంకటస్వామి మరియు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకి వెటా ఫౌండర్ మరియు చైర్పర్సన్ ఝాన్సీ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.వీరితో పాటు భారతీయ మహిళా జాతీయ సమాఖ్య సీనియర్ లీడర్ ప్రేమ్ పావని, భారతీయ మహిళా మోర్చా తెలంగాణ శాఖ అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి మరియు వెటా ప్రతినిధులు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అభితేజ కొండ, సునీత గంపా, శైలజా కల్లూరి, విశ్వ వేమిరెడ్డే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. మహిళలు ప్రతి రంగంలో ముందంజలో నిలవాలంటే నాయకత్వ నైపుణ్యాలు, ఆర్థిక స్వావలంబన, సామాజిక అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళల విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో వెటా ఇండియా కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.


అమెరికాలో ఇప్పటికే మహిళా అభివృద్ధి, నెట్వర్కింగ్, లీడర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందిన వెటా.. ఇప్పుడు ఇండియాలోనూ మహిళలకు ఒక బలమైన వేదికగా మారబోతోందని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ స్థాయి నుంచి నగరాల వరకు మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు.ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, యువతులు, సామాజిక కార్యకర్తలు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.






























