Namaste NRI

సిలికాన్ వేలీలో వైభవంగా పుష్కరోత్సవం – పవిత్రోత్సవం

నడి వేసవి తాపాన్ని శమింపజేసిన వేదనాదామృత ఝరి!

పుష్కరోత్సవంతో పునీతమైన సిలికాన్ వేలీ హైందవ భక్త జనమానసం!!

వేదనాదాలతో ఆనందమయ లోకాల్లో విహరించిన సిలికాన్ వేలీ సనాతన ధర్మ అనుయాయులు!!!

సిలికాన్ వేలీలో వైదిక సంప్రదాయాలకు నెలవై, దైవిక కార్యక్రమాలతో అలరారే శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవస్థానం ఈ నెల 13, 14 15 వ తేదీలలో పుష్కరోత్సవం జరుపుకున్నది. మిల్పిటాస్ నగరంలోఆలయ ప్రాంగణంలోని దేవతా మూర్తుల ప్రాణ ప్రతిష్ట జరిగి పన్నెండు వసంతాలు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ యాజమాన్యం పుష్కరోత్సవం కార్యక్రమాన్ని భక్తి శ్రధ్ధలతో కన్నులపందుగగా నిర్వహించారు. వేదమూర్తులు బ్రహ్మశ్రీ మారేపల్లి నాగవేంకట శాస్త్రి గారి మార్గదర్శకత్వంలో పుష్కరోత్సవం అంగరంగ వైభవంగా సుసంపన్నమయింది.

శనివారం జరిగిన వేడుకలలో అనేక మంది సంఘ నాయకులు పాల్గొన్నారు. ఇందులో మిల్పిటాస్ మరియు ఫ్రీమాంట్ మేయర్లు, అలాగే అసిస్టెంట్ కౌన్సిల్ జనరల్ మరియు పోలీస్ కమిషనర్ ఉన్నారు. సమాజానికి శాంతిని తీసుకురావాలనే వేద ఆలయ లక్ష్యానికి మద్దతు ఇవ్వడానికి వారు చెప్పారు.

తొలుత శుక్రవారం 13 వ తేదీన సిలికాన్ వేలీలో స్థానికులైన 140 పైగా దంపతులచే నిర్వహించిన శ్రీసూక్త హోమం ఎంతో వైభవంగా ప్రారంభయింది. నక్షత్రాల సంఖ్య అయిన 27 సార్లు శ్రీసూక్త పారాయణతో చేసిన హోమం అమెరికాలో ఈ పుష్కరోత్సవానికి ప్రత్యేకంగా నిలిచింది. భక్తులు వేద పఠనలో, హోమం ద్వారా పొందిన శక్తిపాతంలో ప్రదీప్తమయ్యారు. పుష్కరోత్సవం సందర్భంగా నిర్వహించిన కుంభాభిషేకానికి నూటపదహారు వెండి కలశాలలో వరుణ ఆవాహన జరిపి మూడురోజులపాటు పూజలు నిర్వహించారు.

రెండవ రోజైన శనివారం నాడు, ఆలయంలో ప్రతిష్టించిన మూర్తులకు మూలమంత్ర హోమాలు, అన్ని దేవతామూర్తులకు అభిషేకాలతో ఆలయ ప్రాంగణం వేదఝరిలో మారుమోగిపోయింది. అనంతరం సాయంత్రం మహానారాయణ హోమం పలువురికి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇచ్చింది. శ్రీ మారేపల్లి వెంకటశాస్త్రి వారి వద్ద శిష్యరికంలో అమెరికాలోని పలువురు సాఫ్ట్ వేర్ ఇంజనీరులు అధ్యయనం చేసిన ఉపనిషత్తుల పారాయణలో జరిగిన హోమంలో భక్తజనం వేద వృష్టిలో తడిసి పునీతమయ్యారు.

మూడవ రోజైన ఆదివారం నాడు శ్రీ సూర్యభగవానుని కరుణకై “అరుణపారాయణ” తో నిర్వహించిన హోమం భక్తుల హృదయాలను అమృత వృష్టిలో నింపివేసింది. ఆపై ఆలయ కుంభాభిషేకం హైందవేయులను సంతోష జల్లులలతో పావనం చేసింది. విష్ణు సహస్రనామ హోమంలో జనులు విరివిగా పాల్గొని హవిస్సులు సమర్పించడంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నాటి సాయంత్రం జరిగిన కళ్యాణోత్సవం పుశ్కరోత్సవాన్ని సుసంపన్న చేసింది.

ఆలయ యాజమాన్యం శ్రీ అజ్జరపు గోపాల్ గారి అధ్యక్షతన మూడు రోజులను పర్వదినాలుగా అత్యంత శ్రధ్ధాసక్తులతో నిర్వహించింది. గత నాలుగు వారాలుగా ఎంతో మంది ఔత్సాహికులైన కార్యకర్తలను సమీకరించి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు, పూర్తిగా ప్రక్షాళన గావించారు, రంగవల్లులు దిద్దారు, ఎటువంటి ఇబ్బంది లెకుండా భక్తులకు తగిన ఏర్పాట్లు కావింఛారు, భోజనాలకు వసతులు ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం పంక్తి భోజనాలను ఏర్పాటుచేసి అండరికీ కొసరి కొసరి వడ్డించడం పలువురి మెప్పు పొందింది. ఉత్సవంలో ప్రతిరోజూ దాదాపు ఐదువేల మంది పాల్గొని సనాతన సౌరభాన్ని ఆస్వాదింఛారు. అంతేగాక, కుంభాభిషేకం సందర్భంగా డ్రోన్ కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారం చేయడం భక్తులకు సరికొత్త అనుభూతిని అందించింది.

రెండవనాడు సాయంత్రం స్థానిక మిల్పిటాస్ నగర్ మేయర్, కాంగ్రెస్ మన్ ఇత్యాది పలువురు నాయకులు విచ్చేసి ఆలయ యాజమాన్యానికి, భక్తులకు శుభాభినందనలు తెలిపారు. హిందూ సంస్కృతీ సంప్రదాయాలను నిర్వహిస్తున్న తీరును వక్తలు కొనియాడారు. ఆలయ సేవలకు జ్ఞాపికలను అందజేశారు. శ్రీ మారేపల్లి వేంకట శాస్త్రి గారు గత పన్నెండేళ్ళలో ఆలయం వృధ్ధిపొందిన తీరుతెన్నులను ఆత్మీయంగా పంచుకున్నారు. V.E.D.A. ఏర్పాటుచేసిన ముఖ్య ఉద్దేశ్యాన్నీ కార్యాచరణను విశదీకరించారు. ఆలయం స్థాపించిన నాటి నుండి తోడున్నవారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

మూడురోజులపాటు కార్యక్రమాల నిర్వహణకు విశేషంగా ముందుకు వచ్చి నిలిచిన దాతలను యాజమాన్యం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పించారు. ఆలయ పురోహితులను పేరుపేరునా విశేషంగా సత్కరించారు! మూడురోజులపాటు పచ్చని తోరణాల మధ్య, ఆధ్యాత్మిక అనుభూతితో, అలౌకికమైన శక్తి సమీకరించుకుని సిలికాన్ వేలీ హిందూ సమాజం సరికొత్త ఉత్సాహం నింపుకున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events